ఫాస్ట్ వెనక్కి, పాత ఫీజు పథకమే అమలు: కెసిఆర్

Posted On:31-01-2015
No.Of Views:274

 ఫాస్ట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంపై హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఫాస్ట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. పాత ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకమే అమలులో ఉంటుంది. పాత ఫీజుల పథకాన్నే అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే, ఫీజు పథకంలో 371నిబంధనను పాటించనుంది. ఫీజు బకాయిలను చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ, కాలేజీల యాజమాన్యాలు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విడతల వారీగా బకాయిలు చెల్తిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు తమపై నాలుగు సంవత్సరాల ఫీజు బకాయిలు పెట్టి పోయాయని తెలిపారు. వీటన్నింటిని చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు. చెస్ట్ ఆస్పత్రి స్థానంలో సచివాలయం ఏర్పాటు చేయనున్నట్లు, హెచ్‌ఓడీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.రూ. 100 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో హైజెనిక్ కండీషన్‌తో కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాదులోని మోండా మార్కెట్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని అన్నారు. హైదరాబాదులోని రైతు బజార్లను ఆధునీకరిస్తామని చెప్పారు.ఆజ్మీర్‌లో తెలంగాణ యాత్రికులకు రూ.5 కోట్లతో వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్లు, అజ్మీర్ దర్గాలో తానే చాదర్ సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10వ తేదీ వరకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 125 గజాల స్థలాల్లో ఉన్న ఇళ్లకు ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు తాము జారీ చేసిన జీవో నెంబర్ 58 కింద లక్షా 77 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని తెలిపారు. అయితే 125 గజాల కన్న ఎక్కువగా భూమి ఉంటే ఆ భూమికి కొంత మొత్తాన్ని వసూలు చేసి క్రమబద్దీకరణ చేస్తామని పేర్కొన్నారు.