రాజమండ్రి ఘోర ప్రమాదంపై శివాజీ ఆవేదన

Posted On:01-02-2015
No.Of Views:297

తూర్పు గోదావరిలోని మోరంపూడి జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ స్కూలు బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన పైన ప్రముఖ నటుడు, భారతీయ జనతా పార్టీ నేత శివాజీ మండిపడ్డారు. ఫిట్ నెస్‌లేని బస్సుకు అనుమతి ఎలా ఇచ్చారని, వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.రాజకీయాలను భ్రష్టు పట్టించే వారు ఎప్పుడు పోతారోనని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు ఏం సాధించి పెట్టారో అర్థం కావడం లేదన్నారు. ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలన్నారు.దీక్షకు జనాన్ని తరలిస్తున్నందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్నారు. కోర్టు ఒక నోటీసు ఇస్తే పరుగెత్తుకెళ్తారని, వ్యవస్థలో ఆ స్థాయి భయం రావాలన్నారు. ఎవరి బాధ్యతలు వాళ్లు కచ్చితంగా నిర్వర్తిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవన్నారు.కాగా, రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణ స్కూల్‌ బస్సు ఢీకొని ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. తణుకులో జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా కార్యకర్తలు నారాయణ స్కూల్‌ బస్సులో వెళుతున్నారు.అతివేగంగా వచ్చిన బస్సు మోరంపూడి జంక్షన్‌ వద్ద ఎదురుగా వచ్చిన కారును, బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, రోడ్డు పక్కన నడుస్తున్న మరో ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.