విశ్వ నగరంగా హైదరాబాద్.. 1,250 కోట్లతో తొలిదశ ప్రణాళిక

Posted On:04-02-2015
No.Of Views:300

అభివృద్ధి కార్యక్రమాలతో భాగ్యనగరం స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తామని, అమెరికాలోని డల్లాస్ తరహాలో విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. త్వరలోనే రూ. 1,250 కోట్లతో తొలి దశ ప్రణాళిక మొదలుపెడతామని ఆయన చెప్పారు. కబ్జాలపాలైన నాలాల విస్తరణ, ఆధునీకరణకు దశలవారీగా రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. బుధవారం రాత్రి టీ-న్యూస్ చానల్ నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై తన విజన్‌ను ఆవిష్కరించారు. తొలిదశలో అంతర్జాతీయ కన్సల్టెన్సీలు లీ, ఏఈ కామ్ రూపొందించిన ప్రణాళికతో నగరంలో మల్టీగ్రిడ్ రోడ్ సపరేటర్స్ (బహుళ వరుసల రహదారులను) ఏర్పాటు చేస్తామని, ట్రాఫిక్     నరకం నుంచి నగరవాసులకు విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ట్రాఫిక్ చిక్కులు లేకుండా నగరంలో ఎక్కడికైనా చేరుకునేందుకు ఐదు ప్రాంతాల్లో స్కైవాక్‌లు నిర్మిస్తామన్నారు. నగరంలో భూ మాఫియా లేకుండా చూస్తామని, సింగపూర్ తరహాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
 పేదల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం..పేదల కోసం ఎంత ఖర్చుకైనా తమ ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇల్లులేని, జాగా లేని పేదలు ఉండేందుకు వీల్లేదన్నారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీ, అంబేద్కర్‌నగర్ ప్రాంతాల్లో ఇరుకు ఇళ్లలో ఉంటున్న పేదల కష్టాలు చూసి తీవ్రంగా కలత చెందానని కేసీఆర్ చెప్పారు.గత పాలకుల నిర్లక్ష్య వైఖరితోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇళ్ల క్రమబద్ధీకరణకు అందిన 2.34 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేదలు ఉంటున్న చోటనే ఇళ్లు కట్టించి పట్టాలిస్తామని తెలిపారు. మాణికేశ్వరినగర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ ఇళ్లు కట్టిస్తామనారు. ఇప్పటికే చాలా వెసులుబాటు కల్పించామని, ఇంకా క్రమబద్ధీకరించుకోని వారిపై మాత్రం ఉక్కుపాదం మోపుతామని సీఎం స్పష్టం చేశారు. క్రమబద్ధీకరించుకోని భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.
 పేదలకు రూపాయి ఇంటిపన్ను..జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు ఆస్తిపన్ను మినహాయింపునివ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి లేదా రెండు రూపాయలే ఇంటి పన్ను వసూలు చేసే అంశంపై దృష్టి సారించామని సీఎం చెప్పారు. ఈ అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశిస్తామన్నారు. ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే బస్తీకమిటీలతో సమావేశం జరుపనున్నట్లు తెలిపారు. అలాగే రాజధానిలో 30 కొత్త స్మశానవాటికలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
  గ్రేటర్‌లో వెయ్యి మార్కెట్లు.. కోటి జనాభాకు చేరువైన గ్రేటర్‌లో దశలవారీగా వెయ్యి మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తొలివిడతగా మెహిదీపట్నం మార్కెట్‌ను విస్తరిస్తామన్నారు. నగరంలోని ప్రభుత్వ స్థలాల వివరాలు సేకరించి ఆయా ప్రాంతాల్లో మార్కెట్లు, బస్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను విక్రయించి ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు అర్థరహితమన్నారు. హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, వచ్చే వేసవిలో సాగర్‌ను ఖాళీ చేసి పూడిక తీస్తామన్నారు. తనతో సహా మంత్రులు, స్వచ్ఛంద సంస్థలు, నగర వాసులు శ్రమదానం చేస్తారన్నారు. రసాయన వ్యర్థజలాలు సాగర్‌లోకి చేరకుండా కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాను రూ. 50 కోట్లతో దారి మళ్లిస్తామని తెలిపారు. గతంలో 1400 ఎకరాల్లో విస్తరించిన ఈ జలాశయం ఇపుడు 990 ఎకరాలకు పరిమితమైందని ఆవేదన వ్యక్తంచేశారు. జలాశయం కింద తమ భూములున్నాయంటూ కొందరు కోర్టుల్లో కేసులు వేయడం శోచనీయమన్నారు.
నగరంలో హరితహారం.. హెచ్‌ఎండీఏ పరిధిలో 1.50 లక్షల ఎకరాల రిజర్వ్‌ఫారెస్ట్, కేబీఆర్ పార్క్, 3700 ఎకరాల్లో విస్తరించిన మహవీర్ హరిణ వనస్థలి పార్క్‌లను పరిరక్షిస్తామని సీఎం పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి అటవీ భూములను కాపాడతామని స్పష్టంచేశారు. నగరంలో ఏటా మూడు కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో పది కోట్ల మొక్కలు నాటతామన్నారు. మెట్రో రెండో దశ ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం, హయత్‌నగర్, పటాన్‌చెరువు వరకు సేవలను విస్తరిస్తామన్నారు. ఈ మేరకు  ఎల్‌అండ్‌టీ సంస్థకు సూచించినట్లు చెప్పారు.