తైవాన్ విమాన ప్రమాదంలో 31కి చేరిన మృతులు

Posted On:04-02-2015
No.Of Views:332

తైపీ: ఇటీవల మలేసియా విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయిన విషాదాన్ని మరిచిపోకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. బుధవారం తైవాన్‌లో ట్రాన్స్ ఏషియా విమానం ఒకటి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 12 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఏడు నెలల కాలంలో ఆ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురికావడం ఇది రెండో సారి. తైవాన్ స్థానిక కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11:53 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర తైపీలోని సొంగ్షన్ విమానాశ్రయం నుంచి తైవాన్ నియంత్రణలోని కిన్‌మన్ ద్వీపానికి బయల్దేరిన ఆ విమానం మార్గమధ్యంలో రహదారి వంతెనను ఢీకొని అదుపుతప్పి కిలంగ్ నదిలో కుప్పకూలిపోయింది. ఆ విమానం గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకు గగనతల నియంత్రణ వ్యవస్థతో సంబంధాలు కోల్పోయింది. అందులో ఐదుగురు సిబ్బందితో పాటు 58 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలా మంది చైనాకు చెందిన పర్యటకులు ఉన్నారు. 
వంతెనను ఢీకొట్టి నదిలోకి... రహదారి వంతెనను ఢీకొన్న ఆ విమానం ఒక పక్కగా ఒరిగిపోవడంతో దాని రెక్క.. ఆ దారిపై ఉన్న ట్యాక్సీని రాసుకుంటూ వెళ్లిపోయినట్లు సమీపంలో ఉన్న కారులోని కెమెరాకు చిక్కిన దృశ్యాల్లో కనిపిస్తుంది. ఈ వీడియో అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. విమానం వంతెనను ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు నదిలో పడిన విమాన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 15 మందిని శిథిలాల నుంచి వెలికితీసినట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. దాదాపు 400 మంది సైనికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు విమాన మధ్య, వెనుక భాగాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. విమాన ముందు భాగం ఇంకా నీటిలో మునిగిపోయింది. అందులో 17 మంది దాకా చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. చల్లని వాతావరణం, చిమ్మ చీకట్లు, పెరుగుతున్న నీటి మట్టాల కారణంగా సహాయక చర్యలకు అవాంతరం ఏర్పడింది. గల్లంతయిన వారు నీటిలో ముగినిపోయిన విమాన ముందు భాగంలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆ శకలాలను క్రేన్ల సాయంతో వెలికితీస్తామని సహాయక అధికారులు తెలిపారు. విమానానికి సంబంధించిన బ్లాక్‌బాక్సును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
మరోవైపు విమానం గాల్లోకి కొద్దిసేపటికే ఆపదలో ఉన్నట్లు సిబ్బంది సంకేతాలు ఇచ్చారని తైవాన్ పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు. ట్రాన్స్ ఏషియా డైరెక్టర్ మాట్లాడుతూ.. ఆ విమానం గాల్లోకి లేచిన నాలుగు నిమిషాలకే సంబంధాలు తెగిపోయాయని, వాతావరణ పరిస్థితులు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయని కానీ ప్రమాద కారణాలు మాత్రం తెలియరావడం లేదని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే.. విమానం ఇంజిన్‌లో సమస్య రావడం వల్లే ఆ విమానం ఒరిగిపోయి ఉంటుందని పలువురు మాజీ పైలట్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విమాన ఇంజిన్‌లో మంటలు వచ్చాయని సిబ్బంది అరిచినట్లు చివరిసారిగా కాక్‌పిట్‌కు సందేశం వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. జరిగిన ప్రమాదానికి ఎయిర్ ఏషియా బాధితుల కుటుంబాలను క్షమాపణ కోరింది.