నందమూరి బాలకృష్ణ డిక్టేటర్

Posted On:06-02-2015
No.Of Views:296

వంద చిత్రాల మైలురాయికి దగ్గరవుతున్న హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు జోరు మీదున్నట్లు కనిపిస్తోంది. ఒకపక్క 98వ చిత్రంగా తయారవుతున్న ‘లయన్’ షూటింగ్‌లో పాల్గొంటూనే, నూరో చిత్రం దిశగా చర్చలు, ఆలోచనలు సాగిస్తున్నారు. వందో సినిమా ఏదన్నది ఇంకా ఖరారు కాకపోయినా, 99వ సినిమా గురించి మాత్రం అధికారికంగా అంతా సిద్ధమైపోయింది. ఆ మధ్య గోపీచంద్ ‘లౌక్యం’ చిత్రంతో ఘన విజయం సాధించిన దర్శకుడు శ్రీవాస్‌తో బాలకృష్ణ 99వ సినిమాకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.విశేషం ఏమిటంటే, ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం! దర్శకుడు శ్రీవాస్ సైతం మొదటిసారిగా నిర్మాత అవతారమెత్తి, చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడం! ‘ఈరోస్’ సంస్థ తామే ప్రారంభ దశ నుంచి చిత్ర నిర్మాణంలో అధికారికంగా భాగస్వాములై చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే! అలాగే, వారు ఒక దర్శకుడితో కలసి సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్న తొలి చిత్రమూ ఇదే! ఇన్ని విశేషాలున్న ఈ సినిమా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలన వార్తగా నిలిచింది. బాలకృష్ణ సరసన ఆయనకు అచ్చి వచ్చిన కథానాయిక నయనతార ఈ చిత్రంలో నటించనున్నారు.రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ల జంట ఈ చిత్ర కథను రూపొందించింది. ఈ క్రేజీ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు భోగట్టా.