ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌ యత్నాలు

Posted On:08-02-2015
No.Of Views:319

 బీహార్‌ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతూ క్షణక్షణం రంగు మారుతోంది. జేడీ(యూ)శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్‌కుమార్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తుండగా.. అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ సిద్ధమవుతున్నారు. దీంతో మాంఝీకి జేడీ(యూ) అధిష్ఠానానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తుదిదశకు చేరింది. మరోవైపు నితీశ్‌కు మద్దతుగా శనివారం 20మంది మంత్రులు ఇచ్చిన రాజీనామా లేఖలను గవర్నర్‌ ఆమోదించడంతో నాటకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పుడు గవర్నర్‌ నితీశ్‌ను ప్రభు త్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? మాంఝీకి బలనిరూపణ అవకాశమిస్తారా? అన్న చర్చ నడుస్తోంది. కోల్‌కతాలో ఉన్న గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీ సోమవారం పాట్నా రానుండటంతో ఆయన నిర్ణ యం మేరకు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారు తుందని పరిశీలకుల అంచనా. కాగా.. ఇప్పటికీ బీహార్‌ సీఎం తానేనని మాంఝీ పునరుద్ఘాటించా రు. ‘‘మాంఝీ పడవ ఎప్పటికీ మునగదు’’ అని ఆదివారం ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఆయన వ్యాఖ్యానించారు. 19, 20తేదీల్లో తాను బలనిరూప ణ చేసుకుంటానని.. విఫలమైతేనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు మద్దతివ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. నితీశ్‌కు సంఖ్యాబలముంటే అంత తొందరెందుకని ప్రశ్నించారు. అధికార లేకుండా నితీశ్‌ ఉండలేరని.. అందుకే తనను దించాలని చూస్తున్నారని ఆరోపించారు. దళితుడనైనందుకే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక పేద దళితుడికి అండగా ఉండాలో వద్దో అన్న నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కేబినెట్‌ను విస్తరిస్తానని చెప్పారు. మరోవైపు నితీశ్‌కు మద్దతుగా జేడీయూ, దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలు 130 మంది సంతకాలతో కూడిన లేఖను జేడీ(యూ) బృందం రాజ్‌భవన్‌కు అందజేసింది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐల ప్రతినిధులుకూడా కూడా మద్దతు లేఖలు ఇచ్చారు. మరోవైపు శాసనసభాపక్షనేతగా నితీశ్‌ ఎన్నికను స్పీకర్‌ ఉదయ్‌నారాయణ్‌ చౌదరి గుర్తించారు. తమ పార్టీలో విభేదాలు సృష్టించి లబ్ధిపొం దాలని బీజేపీ కుట్ర చేస్తున్నట్లు జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఆరోపించారు. నితీశ్‌సభాపక్ష నేతగా ఎన్నికయ్యాక నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనే అర్హత మాంఝీకి ఎక్కడిదని ప్రశ్నించారు. కాగా, నితీశ్‌ అధికార దాహంవల్లే ఆ పార్టీలో సంక్షోభం తలెత్తిందని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ విమర్శించారు. ఇక నితీశ్‌కు మద్దతుపై ఆర్జేడీ అధినేత లాలూ నిర్ణయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వ్యతిరేకిస్తున్నారు.