రచయిత కేశవరెడ్డి కన్నుమూత

Posted On:13-02-2015
No.Of Views:380

తెలుగు సాహిత్యంలో ‘హెమింగ్వే’గా ప్రసిద్ధుడు, ప్రముఖ నవలా రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. కొన్ని నెలల క్రితం మరింత విషమించింది. అప్పటినుంచీ నిజామాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని వారాలుగా వెంటిలేటర్‌ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కేశవరెడ్డికి భార్య ధీరమతి, కుమారుడు డాక్టర్‌ నందన్‌రెడ్డి, కుమార్తె డాక్టర్‌ దివ్య ఉన్నారు. ఆయన కుష్ఠు రోగులకు వైద్య సేవలు అందించిన డిచ్‌పల్లిలోని విక్టోరియా ఆస్పత్రి ప్రాంతంలో శనివారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కేశవరెడ్డి మృతి పట్ల ఆంఽధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ‘రచనలతో లక్షలాదిమందిని కదిలించారు’ అని కొనియాడారు.
ఆధునిక తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన డాక్టర్‌ కేశవరెడ్డి.. చిత్తూరు జిల్లాలో మార్చి 10, 1947లో రంగారెడ్డి-అమ్మణ్నమ్మ దంపతులకు జన్మించారు. నిజామాబాద్‌ డిచ్‌పల్లి మండల కేంద్రంలోని విక్టోరియా ఆసుపత్రిలో 32 ఏళ్లుగా కుష్ఠురోగులకు సేవలు అందించి రిటైర్‌ అయ్యారు. ఆయనపై అమెరికన్‌ నవలాకారుడు ఎర్నెస్ట్‌ హెమింగ్వే ప్రభావం ఎక్కువ. హెమింగ్వే ‘ద ఓల్డ్‌మన్‌ అండ్‌ ద సీ’ ప్రేరణతో..నిండైన తెలుగు వాతావరణంలో ‘అతడు అడవిని జయించాడు’ నవలను రచించారు. ఈ నవలను నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ 14 భారతీయ భాషల్లోకి అనువదించింది. దళితవాదానికి ఊపు తెచ్చిన రచనగా.. ఇంక్రెడిబుల్‌ గాడెస్‌ను పరిగణిస్తారు. ఈ నవల మరాఠీ, కన్నడ భాషలలోకి అనువదించబడింది. చివరి గుడిసె, మునెమ్మ, మూగవాని పిల్లనగ్రోవి, సిటీ బ్యూటీపుల్‌, శ్మశానాలు దున్నేరు తదితర కేశవరెడ్డి నవలలు.. ఉత్తమ క్లాసిక్స్‌గా పేరు పొందాయి.
సున్నితమైన మానవ, కుటుంబ సంబంధాలను చిత్రీకరించడంలో డాక్టర్‌ కేశవరెడ్డి గొప్ప నేర్పు ప్రదర్శించినట్టు.. సాహితీవేత్తలు నివాళి అర్పించారు. ‘బతుకు మర్మం తెలిసిన రచయిత కేశవరెడ్డి’ అని ప్రముఖ ప్రజాకవి గోరటి వెంకన్న అన్నారు. నిజామాబాద్‌లోని కేశవరెడ్డి స్వగృహంలో ఆయన పార్థివదేహాన్ని దర్శించుకొని నివాళి అర్పించారు. మానవుడి నిరంతర సంఘర్షణను సానుకూల దృక్పఽథంతో ఆయన రచనలు చూపుతాయని నిజామాబాద్‌ ఎంపీ కవిత కొనియాడారు. ప్రత్యామ్నాయ నవలా శిల్పాన్ని సాహిత్యలోకానికి అందించారని జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అన్నారు. కొత్త కొత్త కథాంశాల్లో రాయలసీమ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయనవంటి రచయిత తెలుగు సాహిత్యానికి మళ్లీ లభించరని ‘విరసం’ నేతలు వరవరరావు, వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నవలా సాహిత్యానికి కొత్త భాష్యం చెప్పారని తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. దళితుల పక్షాన నిలిచి వారిలో ధైర్యం నింపారని విద్యావేత్త చుక్కారామయ్య కొనియాడారు. ఆయన రచనలు నవలా శిల్పానికి మంచి చేర్పుగా కవి నందిని సిధారెడ్డి అభివర్ణించారు. రచయితల గౌరవాన్ని రెట్టింపు చేసిన మహానీయుడని ‘తెరవే’ అధ్యక్షుడు జయధీర్‌ తిరుమలరావు నివాళి అర్పించారు. తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటుగా సాహితీ స్రవంతి అధ్యక్షుడు తెలకపల్లి రవి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుగంలోనూ కొనసాగుతున్న భూస్వామ్యంపై కలం కదిపిన గొప్ప రచయితగా.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి నివాళి అర్పించారు. గొప్ప రచయితను కోల్పోయామని రచయిత్రి ఓల్గా అన్నారు. తెలంగాణ కవి జూలూరీ గౌరీశంకర్‌, దళిత రచయిత్రి సుభద్ర, పడావు రామారావు తదితరులు సంతాపం తెలిపారు.