అమ్మ బాధను చూసి తట్టుకోలేకపోయా: నాగార్జున

Posted On:13-02-2015
No.Of Views:281

 ‘అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె పడుతున్న బాధను చూసి నేను తట్టుకోలేక పోయాను. అప్పుడు పెయిన్ అండ్ పాలియేటీవ్ కేర్ గురించి మాకు తెలియలేదు. దీంతో ఆమెకు ఈ సర్వీసును అందించలేకపోయాం. నాన్నకు అరోగ్యం క్షీణించిన తరువాత డాక్టర్ సలహా మేరకు ఈ పద్ధతిని అనుసరించాం. దీంతో ఆయన తుదిశ్వాస విడిచేవరకు నొప్పి తెలియకుండానే సంతోషంగా గడిపారు.’అని సినీనటుడు అక్కినేని నాగార్జున చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటీవ్ కేర్ 22వ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో శుక్రవారం ప్రారంభమైంది. సదస్సుకు దేశవిదేశాల నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆఖరిదశలో ఉన్నవారి పాలిట ఈ పాలియేటీవ్ కేర్ చికిత్స ఓ గొప్ప వరం లాంటిదని కొనియాడారు. ఈ చికిత్సపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు.ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చందా మాట్లాడుతూ పాలియేటీవ్ కేర్ సెంటర్లకు నొప్పి నివారణ మందులను అందించాలని కోరారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారితోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సుఖమయమైన జీవితాన్ని ప్రసాదించవచ్చన్నారు. సదస్సులో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలేటీవ్ కేర్ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్ సింహ, హైదరాబాద్ ఐఏపీసీ అధ్యక్షులు డాక్టర్ మంజుల, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.