వంటింటికి మాడ్యులర్ కిచెన్స్‌

Posted On:14-02-2015
No.Of Views:369

 ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఓ భాగమే కిచెన్ డిజైనింగ్. రానురానూ దీనికి ఆదరణ పెరిగి మాడ్యులర్ కిచెన్ డిజైనింగ్ అనే ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెందింది. ఒక మాదిరి కుటుంబ స్థాయి ఉన్నవారెవరైనా ఇంట్లో వంట కోసం ఓ ప్రత్యేక గదిని కేటాయిస్తున్నారు.
 మాడ్యులర్ కిచెన్ అంటే..
వంటింట్లోని సామగ్రి బయటకు కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా తీర్చిదిద్దడమే మాడ్యులర్ కిచెన్. ఇల్లు పాతదైనా.. కొత్తదైనా.. వంట గదిని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంతో పాటు అవసరమైనప్పుడు తెరచుకునేలా, కావాల్సిన వైపుకు తిప్పుకునేలా మాడ్యులర్ కిచెన్‌లో ర్యాకులుంటాయి.
 బడ్జెట్‌ను బట్టి: ఇందుకోసం ముందుగా తయారీ విడి భాగాలతో ఒక నమూనా తయారు చేస్తారు. కేటాయించిన స్థలం, ఖాతాదారుడి బడ్జెట్‌పై వీటి తయారీ ఆధారపడి ఉంటుంది. వంటగదికి కేటాయించిన స్థలాన్ని అంచనావేసి, దానికి అనుగుణంగా విడిభాగాలను సేకరించి వంటగదిలో అమర్చుతారు. తక్కువ స్థలంలో ఇముడుతూ, ఎక్కువ అందంగా వంటగది కనిపించేలా చూడటమే డిజైనర్ పని.
 రూ.10 వేల నుంచి మొదలు: మన ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగానే మాడ్యులర్ కిచెన్స్‌లోనూ పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వంటింట్లోని సామగ్రి బయటకు కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా రూపుదిద్దుతున్నారు. వీటి ధరలు రూ.10ల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాడ్యులర్ కిచెన్స్ నుంచి పొగ బయటకు రాదు. పాతకాలంలో పొయ్యి మీద పొగ గొట్టాలున్నట్లుగానే ఉంటాయి. కానీ ఇవి అధునాతనంగా ఉంటాయి. దీంతో పాటు వంట సామాగ్రి  చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. లిమెన్స్ కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల పేర్లతో మన అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక అరలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును మోసేలా ఉంటుంది. వీటికి వేడి తగిలినా.. నీటిలో తడిచినా ఏమాత్రం చెక్కుచెదరవు.