క్రికెట్‌ వినోదం విశ్వజనీనం

Posted On:14-02-2015
No.Of Views:378

 ప్రపంచ కప్ వచ్చేసింది... 44 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగించేందుకు... నిద్రాహారాలు మాని అంకెలనే ఆరగించేందుకు... ఫోర్లు, సిక్సర్లు, రికార్డులతో సహవాసం చేసేందుకు... వినోదాల విందు అందించేందుకు... ప్రపంచ కప్ అంటే ఆటగాళ్లు, అభిమానులకే కాదు, ప్రకటనదారులు, వ్యాపారులు, బెట్టింగ్ రాయుళ్లు...ఇలా అందరికీ పండగే. ఈ సమయంలో ఉద్యోగాల టైమింగ్ మారిపోవచ్చు, సెలవుల కోసం కొత్త తరహా సాకులు పుట్టుకు రావచ్చు.
 సరిగ్గా చెప్పాలంటే దినచర్య మొత్తం క్రికెట్‌తోనే ముడి పడి ఉండవచ్చు. 2015లో వరల్డ్ కప్ వీక్షించేందుకు సిద్ధమైపోయినవారిలో 1975నాటి టోర్నీని చూసిన తాతలు ఉండవచ్చు, ఈ టోర్నీతో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న చిన్నారి ఫ్యాన్స్ ఉండవచ్చు. ఎవరెలా ఆలోచించినా ఈ వినోదం మాత్రం విశ్వజనీనం. ప్రతీ సారి ఏదో ఒక మార్పుతో ముందుకు వచ్చిన ప్రపంచ కప్‌లో ఈసారి ఏదైనా కొత్తగా ఉండబో తోందా... అసలు టోర్నీలో గతంలో లేని విధంగా ఏమైనా విశేషాలు ఉండబోతున్నాయా.           
 ప్రపంచ కప్ క్రికెట్‌లో జట్ల విజయావకాశాలు, బలాబలాలపై బోల్డన్ని విశ్లేషణలు...ఎవరు ముందుకు వెళతారు అంటూ చర్చలు. కానీ నిజాయితీగా చూస్తే ఈ సారి కూడా ప్రపంచ కప్‌లో లీగ్ దశ మొత్తం అంచనాలకు అనుగుణంగానే ఉండవచ్చు. పసికూనల సంచలనాలు అంటూ ఏమైనా వినిపించినా...పెద్ద జట్లు వెంటనే కోలుకోవడం, ఆశించిన విధంగానే తర్వాతి దశకు చేరుకోవడం గతంలోనూ జరిగాయి. కాబట్టి టోర్నీలో తొలి నెల రోజుల వరకు పెద్ద జట్ల అభిమానులంతా గుండెల మీద చేయి వేసుకొని ఉండవచ్చు.
 పెద్ద జట్లు... క్వార్టర్స్‌కు ఖాయం: పేరుకు ప్రపంచ కప్ కానీ సుదీర్ఘ కాలంగా క్రికెట్‌లో కొన్ని జట్లదే ఆధిక్యం కనిపిస్తోంది. 2007లో భారత జట్టు అనూహ్యంగా ఒక్క మ్యాచ్‌లో పరాజయం కారణంగా టోర్నీనుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కప్ టీవీ రేటింగ్‌లు ఒక్కసారిగా పడిపోయాయి. అంతకు ముందు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌పై పెరిగిన అంచనాల నేపథ్యంలో భారీ ఆశలు పెట్టుకున్న వాణిజ్య సంస్థల వ్యాపారం నేలకు తాకింది. దాంతో ఐసీసీ గుండెల్లో రాయి పడింది.
  ఫలితమే 2011 ప్రపంచ కప్‌లో అతి సులువైన ఫార్మాట్‌ను ఎంపిక చేశారు. పేరుకు లీగ్ దశలో ఏడు జట్లు ఉన్నా... చెరో గ్రూప్‌నుంచి నాలుగు జట్లు ముందంజ వేయడంలోనే లీగ్ దశ అంటే తేలిక భావం కనిపిస్తుంది. కాబట్టి ఎలా చూసినా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఖాయమే. వార్మప్‌లో లంకపై జింబాబ్వే సంచలనం సృ ష్టించినా...అది అసలు పోరులో కనిపించే అవకాశాలు తక్కువ.
 మూడు మ్యాచ్‌లే కీలకం: ఇప్పుడున్న ఫార్మాట్ ప్రకారం అసలైన మూడు మ్యాచ్‌లు గెలిచిన జట్టు విశ్వవిజేతగా నిలుస్తుంది. పెద్ద జట్లు ఆరంభంలో తడబడ్డా...కోలుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి క్వార్టర్స్, సెమీస్, ఫైనల్... ఈ మూడు మ్యాచ్‌లే ప్రతీ జట్టుకు కీలకం. కాబట్టి ప్రతీ జట్టు ఈ మూడు మ్యాచ్‌ల గురించే ఆలోచిస్తోంది. అసలు అంతకు ముందు జరిగే మ్యాచ్‌లు ప్రపంచకప్‌లో భాగం కాదా అనే విధంగా టోర్నీ ఫార్మాట్ కనిపిస్తోంది. మ్యాచ్‌లు ఎన్ని ఉన్నా అసలు పోరు మాత్రం మార్చి 18నుంచి మొదలవుతుందని చెప్పవచ్చు. లీగ్ దశలో తడబడి గ్రూప్‌లో నాలుగో స్థానంతో క్వార్టర్స్‌కు చేరినా ఫర్వాలేదు. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే సగర్వంగా కప్‌ను అందుకోవచ్చు.
 అద్దె ప్రపంచ కప్
 గత ప్రపంచ కప్‌లో భారత్‌లో జరిగిన మ్యాచ్‌లలో పరుగుల పంట పండింది. జీవం లేని వికెట్లు, చిన్న మైదానాలు...బంతి తాకితే బౌండరీ దాటడమే. ఈసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మాత్రం పరిస్థితి భిన్నం. పేస్, బౌన్సీ వికెట్లతో పాటు వాతావరణం కూడా ఇక్కడ ప్రభా వం చూపిస్తుంది. కాబట్టి ఏకపక్షంగా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోకుండా... బౌలర్లు కూడా తమ సత్తా చాటేందుకు అవకాశం ఉంది.
  అయితే అన్నింటినీ మించి తొలిసారి ప్రపంచకప్‌లో డ్రాప్ ఇన్ పిచ్‌లపై మ్యాచ్‌లు జరగబోతుండటం ఈసారి కొత్త పరిణామంగా చెప్పవచ్చు. ఏడు నాకౌట్ మ్యాచ్‌లలో ఐదు ఈ తరహా పిచ్‌లపైనే ఉన్నాయి. ఇది ఓ రకంగా ఆతిథ్య జట్టుకు కొంత వరకు అనుకూలత కూడా తగ్గించవచ్చు. దీని గురించి ఆస్ట్రేలియాలో అద్దె ప్రపంచ కప్ అంటూ సరదాగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 పెద్దోడు... చిన్నోడు
 ఈ ప్రపంచకప్ ఆడుతున్న వారిలో పెద్ద వయస్కుడు ఖుర్రమ్ ఖాన్ (యూఏఈ - 43 ఏళ్లు), చిన్న వయస్కుడు ఉస్మాన్ ఘనీ (అఫ్ఘానిస్తాన్ -18 ఏళ్లు)
 పొడుగోడు... పొట్టోడు
 టోర్నీలో ఆడుతున్న వారిలో పొడవైన ఆటగాడు మొహమ్మద్ ఇర్ఫాన్ (పాక్- 7.1 అడుగులు), పొట్టి ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్ -5.3 అడుగులు)