రక్షణ కోసం నలభై లక్షలు!

Posted On:14-02-2015
No.Of Views:416

అందాల సుందరి ఐశ్వర్యా రాయ్‌ని కథానాయికగా తీసుకుంటే ఆమెకు కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చడానికి నిర్మాత సిద్ధంగా ఉండాల్సిందే. ఆ సౌకర్యాల ఖర్చు తడిసి మోపెడైనా సరే. ప్రస్తుతం హిందీలో చాలామంది అనుకుంటున్న మాటలివి. దానికి కారణం లేకపోలేదు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఐశ్వర్యా రాయ్ కథానాయికగా నటిస్తున్న ‘జజ్బా’ చిత్రం షూటింగ్ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే.
ఐష్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె బయటకు వస్తే చాలు.. చూడడానికి జనాలు ఎగబడతారు. పైగా, ఐదేళ్ల తర్వాత నటిస్తున్నారు కాబట్టి, ఆమెను చూడ్డానికి అభిమానులు షూటింగ్ లొకేషన్‌కి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ కారణంగా ఐష్‌కి ఇబ్బందితో పాటు, షూటింగ్‌కి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే, దాదాపు పన్నెండు మంది బాడీగార్డులను నియమించారట. ఇంటి నుంచి ఐష్ షూటింగ్‌కి వచ్చేటప్పుడు, మళ్లీ ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె వెంట ఆ పన్నెండు మంది రక్షకులు ఉంటారట.
ఇంతకీ వీళ్లకి అయ్యే ఖర్చెంతో తెలుసా? 40 లక్షలని సమాచారం. ఈ ఖర్చు భరించేది నిర్మాతే. ఇంకో విషయం ఏంటంటే.. అప్పుడప్పుడు తన కుమార్తె ఆరాధ్యా బచ్చన్‌ని లొకేషన్‌కి తీసుకువస్తే, ఆ పాప ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఓ క్యారవాన్ తయారు చేయించారట. మరి.. ఐషా? మజాకానా?