మధ్య తరగతికి రాయితీలు!

Posted On:22-02-2015
No.Of Views:391

ఢిల్లీ:. మధ్య తరగతి ప్రజలకు వరాల జల్లు కురిపించేలా ఈ బడ్జెట్ ఉండొచ్చని సమాచారం. పన్ను స్లాబ్‌లను పెంచడం, పొదుపు స్కీముల్లో పెట్టుబడుల పరిమితిని పెంచడం వంటి వరాలు ఉండొచ్చని అంచనా. వీటికి తోడు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొన్ని రాయితీలు దక్కవచ్చని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులకు ఊపునివ్వడానికి పలు చర్యలు  బడ్జెట్‌లో ఉండొచ్చని ఊహాగానాలున్నాయి.
 గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన  బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే ధోరణి  ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్‌లో చోటు చేసుకోవచ్చు. గత ఏడాది  వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకూ పెంచారు. అలాగే పొదుపు పత్రాల్లో పన్నురహిత పెట్టుబడి పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు.
అయితే ఈ బడ్జెట్‌లో ఈ రెండింటిలో ఏదో ఒక దానినే(ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం కానీ, పన్ను రహిత పొదుపు పరిమితి పెంచడం కానీ)  ఆయన ఎంచుకుంటారని విశ్లేషకులంటున్నారు. అధిక వృద్ధి సాధన కోసం  ప్రభుత్వ వ్యయం అధికంగా చేయాల్సి ఉన్నందున అదనపు రాబడి సాధించడంపై అరుణ్ జైట్లీ దృష్టి సారిస్తున్నారని, అందుకని ఏదో ఒకటి మాత్రమే సాద్యమని వారంటున్నారు. ఆరోగ్య బీమా రంగంలో పన్ను మినహాయింపు పెట్టుబడుల పరిమితిని అరణ్ జైట్లీ పెంచవచ్చు. పెన్షన్ స్కీమ్‌ల్లో పెట్టుబడులపై కూడా  మినహాయింపులు ఇవ్వొచ్చు.
మౌలిక రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెడుతున్న నేపథ్యంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లకు పన్ను ఆదా ప్రయోజనాలు ఉండవచ్చు. గృహరుణానికి సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులపై కూడా భారీగా పన్ను రాయితీలు చోటు చేసుకోవచ్చు. గృహ రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని గత ఏడాది  రూ.2 లక్షలకు పెంచారు.
కంపెనీలు, వ్యక్తులపై సర్‌చార్జీల విషయంలో ఆర్థిక మంత్రి గత ఏడాది ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. రూ. కోటి ఆదాయం ఉన్న వ్యక్తులు, రూ.10 కోట్ల లాభమార్జించే కంపెనీలపై ఆయన 10 శాతం సర్‌చార్జీ విధించారు. పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్(గార్)ను  రెండేళ్లు వాయిదా వేస్తారని అంచనా.  ఇక ప్రత్యేక ఆర్థిక మండలాలాలకు(సెజ్) పన్ను రాయితీలివ్వాలన్న ఒత్తడి ఆరుణ్ జైట్లీపై బాగా పెరుగుతోంది. చాలా సెజ్ డెవలపర్లు వాటిని నిర్వహించలేక చేతులెత్తేయడంతో పన్ను రాయితీల కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇక పరోక్ష పన్నుల విషయానికొస్తే, వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని అంచనా. ఈ జీఎస్‌టీలో ఒకే రేటు పన్ను ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ రేటును 12 శాతం నుంచి పెంచే అవకాశాలున్నాయి.
  జాబ్ మార్కెట్‌కు ఊపునివ్వడానికి తగిన చర్యలను, కార్మిక సంస్కరణలకు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పెద్ద పీట వేస్తారని మానవ వనరుల నిపుణులంటున్నారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేక్ ఇన్ ఇండియా హోరెత్తుతున్న నేపథ్యంలో జాబ్ మార్కెట్ వృద్ధికి తోడ్పడే చర్యలు బడ్జెట్‌లో ఉండొచ్చని అంచనాలున్నాయి. కార్మికుల్లో దాదాపు 94 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారని, వీరికి ఎలాంటి సామాజిక భద్రత, ప్రయోజనాలు లేవని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు. 44 కార్మిక చట్టాలను ఐదు చట్టాలుగా క్లుప్లీకరించాలని, దీంతో కార్మిక చట్టాల ఆచరణకు వీలవుతుందని, సంక్లిష్టత కూడా తగ్గుతుందని వివరించారు.