భారత్‌ ఆల్‌రౌండ్‌ షో

Posted On:22-02-2015
No.Of Views:393

వరల్డ్‌క్‌పలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-బిలో పోరులో భాగంగా పటిష్ట దక్షిణాఫ్రికాతో ఆదివారమిక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 130 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆల్‌రౌండ్‌ షోతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. తద్వారా వరల్డ్‌క్‌పల్లో దక్షిణాఫ్రికాపై తొలి విజయాన్ని అందుకుని 1992, 1999, 2011లో ఎదురైన పరాభవాలకు బదులు తీర్చుకుంది. ధోనీసేన నిర్దేశించిన 308 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దుర్భేద్యమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన సఫారీలు 40.2 ఓవర్లలో 177 రన్స్‌కే చేతులెత్తేశారు. ఫా డుప్లెసిస్‌ (71 బంతుల్లో 5 ఫోర్లతో 55) ఒక్కడే కాస్త పోరాడాడు. కెప్టెన్‌ ఏబీ డివిల్లీర్స్‌ (30), హషీమ్‌ ఆమ్లా (22), డేవిడ్‌ మిల్లర్‌ (22) శుభారంభం దక్కినా భారీ స్కోరు సాధించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్‌ మూడు, మహమ్మద్‌ షమి, మోహిత్‌ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శిఖర్‌ ధవన్‌ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 137) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అజింక్యా రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) భారీ స్కోరుకు బాటలు వేశాడు. విరాట్‌ కోహ్లీ 46 పరుగులు చేశాడు. సఫారీ బౌలర్లలో మోర్నె మోర్కెల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. డేల్‌ స్టెయిన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు ధవన్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. కాగా, భారత్‌ ఈనెల 28న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పసికూన యూఏఈతో తలపడనుంది. 
బ్యాటింగ్‌ భళా...: టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్‌ శర్మ (0) పరుగుల ఖాతా తెరవకుండానే రనౌటయ్యాడు. అయితే ధవన్‌, కోహ్లీ రెండో వికెట్‌కు 127 పరుగులు జోడించడంతో భారత్‌ కోలుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని తాహిర్‌ విడగొట్టాడు. అర్ధ శతకానికి చేరువైన కోహ్లీ.. తాహిర్‌ బౌలింగ్‌లో డుప్లెసి్‌సకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. ధవన్‌కు రహానె జతకలిసిన తర్వాత ఇన్నింగ్స్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. ఇద్దరూ వేగంగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ధవన్‌ 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ధవన్‌కిది ఏడో శతకం కాగా, కెరీర్‌ అత్యుత్తమ స్కోరు కూడా ఇదే. ధవన్‌ సెంచరీ చేసిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ నెగ్గడం విశేషం. అలాగే వరల్డ్‌క్‌పల్లో దక్షిణాఫ్రికాపై ఓ బ్యాట్స్‌మన్‌ ఇన్ని పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. మరోవైపు రహానె కూడా ధాటిగా ఆడడంతో 36.3 ఓవర్లలోనే భారత్‌ స్కోరు రెండొందల మార్కు దాటింది. బౌలర్‌ ఎవరనేది లెక్కచేయకుండా ఎదురుదాడికి దిగిన రహానె 40 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ ఇద్దరూ 99 బంతుల్లో 125 రన్స్‌ జోడించారు. ధవన్‌ అవుటవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. 
చివర్లో టపటపా..: ధవన్‌ అవుటైనపుడు భారత్‌ స్కోరు 43.4 ఓవర్లలో 261/3. ఇంకా 6.2 ఓవర్లు మిగిలున్నాయి. భారత్‌ ఇన్నిం గ్స్‌ ఒక్కసారిగా తడబడింది. రైనా (6)ను మోర్కెల్‌ వెనక్కి పంపాడు. ఆ వెంటనే రహానె కూడా స్టెయిన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. జడేజా (2) రనౌటయ్యాడు. ధాటిగా ఆడతాడనుకున్న ధోనీ (18) కూడా నిరాశపరిచాడు. దీంతో చివర్లో భారత్‌ 41 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయింది. 
సఫారీలు డీలా..: భారీ లక్ష్య ఛేదనలో సఫారీలు డీలా పడిపోయారు. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే క్వింటన్‌ డికాక్‌ (7)ను పెవిలియన్‌కు చేర్చిన షమి సఫారీల పతనానికి నాంది పలికాడు. కొద్దిసేపటికే మోహిత్‌ శర్మ వేసిన షార్ట్‌పిచ్‌ బంతికి ఆమ్లా బలయ్యాడు. ఈ దశలో డుప్లెసిస్‌, డివిల్లీర్స్‌ మూడో వికెట్‌కు 68 రన్స్‌ జోడించారు. ఈ సమయంలో డివిల్లీర్స్‌ రనౌటవడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. హాఫ్‌ సెంచరీ పూర్తయిన తర్వాత డుప్లెసిస్‌ కూడా అవుటయ్యాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 133/3. అక్కడి నుంచి సఫారీల పతనం వేగంగా సాగింది. ప్రమాదకర డుమిని (6), మిల్లర్‌ వెంటవెంటనే అవుటవడంతో ఓటమి ఖాయమైపోయింది. ఫిలాండర్‌ (0), స్టెయిన్‌ (1), మోర్కెల్‌ (2), ఇమ్రాన్‌ తాహిర్‌ (8) ఇలావచ్చి అలా వెళ్లిపోయారు. వేన్‌ పార్నెల్‌ (17) నాటౌట్‌గా మిగిలాడు.