ఫైనల్లో కివీస్.. సఫారీలకు నిరాశ

Posted On:24-03-2015
No.Of Views:337

ఆక్లాండ్: న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్లో తొలిసారి ఫైనల్ చేరింది. గతంలో ఆరుసార్లు సెమీస్లో బోల్తాపడిన కివీస్ ఈ సారి ఆ గండాన్ని అధిగమించింది. మంగళవారం చివరి బంతి వరకు హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్లో కివీస్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ బెర్తు సొంతం చేసుకుంది. ఇలియట్ (84 నాటౌట్)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 29న జరిగే గ్రాండ్ ఫైనల్లో కివీస్.. భారత్, ఆస్ట్రేలియాల రెండో సెమీస్ విజేతతో తలపడనుంది. సెమీస్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో 43 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 298 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ 6 వికెట్లు కోల్పోయి చివరి బంతి మిగిలుండగా విజయం సాధించింది. ఓపెనర్లు గుప్తిల్, బ్రెండన్ మెకల్లమ్ శుభారంభం అందించారు. వీరిద్దరూ 36 బంతుల్లో 71 పరుగులు చేశారు. బ్రెండన్ (26 బంతుల్లో 59) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కాగా కివీస్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న దశలో సౌతాఫ్రికా పేసర్ మోర్కెల్ బ్రేక్ వేశాడు. మోర్కెల్ వరుస ఓవర్లలో మెకల్లమ్, విలియమ్సన్ను అవుట్ చేశాడు. అయినా గుప్తిల్, రాస్ టేలర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా కీలక సమయంలో పెవిలియన్ చేరారు.  ఇలియట్ (84 నాటౌట్) వీరోచిత పోరాటంతో పాటు ఆండర్సన్ (58) రాణించి కివీస్ను గెలిపించారు. స్టెయిన్ వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతికి ఇలియట్ సిక్సర్ సంధించడంతో కివీస్ విజయం ఖాయమైంది. మోర్కెల్ మూడు వికెట్లు తీశాడు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సఫారీ టీమ్ నిర్ణీత 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం కివీస్ కు 43 ఓవర్లలో 298 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఆరంభంలో సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కాగా డుప్లెసిస్, డివిలియర్స్, మిల్లర్ జట్టును ఆదుకున్నారు. డుప్లెసిస్ (82; 106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్) నిలకడగా ఆడాడు. డివిలియర్స్ తనదైన శైలిలో కదం తొక్కాడు. చివర్లో మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డివిలియర్స్ 45 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో అజేయంగా 65 పరుగులు చేశాడు. మిల్లర్(49) ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీ కోల్పోయాడు. 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు బాదాడు. కివీస్ బౌలర్లలో ఆండర్సన్ 3, బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు.