యమహా స్కూటర్స్‌లో కొత్త వేరియంట్‌లు

Posted On:27-03-2015
No.Of Views:317

న్యూఢిల్లీ: యమహా కంపెనీ తన మూడు స్కూటర్ మోడళ్లు-ఆల్ఫా, రే, రే జెడ్‌లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు కొత్త వేరియంట్లను బ్లూ కోర్ ఇంజిన్ కాన్సెప్ట్‌తో రూపొందించామని యమహా మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ పేర్కొన్నారు. ఈ బ్లూ కోర్ ఇంజిన్ కాన్సెప్ట్ పర్యావరణానికి అనుకూలమైనదని, అంతేకాకుండా ఎక్కువ మైలేజీ కూడా వస్తుందని వివరించారు. గతంలో 62 కి.మీ.గా ఉన్న మైలేజీ ఈ కొత్త బ్లూ కోర్ ఇంజిన్ కారణంగా 66 కి.మీ.కు పెరుగుతుందని వివరించారు.ఆల్ఫా ధర రూ.49,939, రే జెడ్ ధర రూ.48,936, రే ధర రూ.47,805గా నిర్ణయించామని(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) తెలిపారు. కొత్త ఫీచర్లు, గ్రాఫిక్స్‌తో ఈ కొత్త వేరియంట్‌లను రూపొందించామని తెలిపారు. భారత టూవీలర్ల మాస్ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలవాలనుకుంటున్నామని, దీనిని సాధించడానికి స్కూటర్లపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ మొత్తం అమ్మకాల్లో సగం స్కూటర్ల అమ్మకాలు ఉండగలవని అంచనా వేస్తున్నామని చెప్పారు.  ప్రస్తుతం 5 శాతంగా(నెలకు 5 లక్షల స్కూటర్ల విక్రయాలు) ఉన్న తమ మార్కెట్ వాటాను ఈ కొత్త స్కూటర్ల వేరియంట్‌లతో ఈ ఏడాది చివరికల్లా 10 శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు.