కన్యాలో ఉగ్రవాదుల దాడి : 150 మంది విద్యార్థుల వూచకోత

Posted On:03-04-2015
No.Of Views:314

కెన్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. సోమాలియాకు చెందిన 'అల్-షబాబ్'(అల్‌ఖైదా అనుబంధ సంస్థ) ఉగ్రవాదులు ఈశాన్య కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై గురువారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 150 మంది విద్యార్థులు మృతిచెందారని అధికారులు తెలిపారు. భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయని కెన్యా అంతర్గత వ్యవహారాల మంత్రి జోసెఫ్ ఎన్‌కైసెరీ ప్రకటించారు. ఎంతమంది ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారో స్పష్టంగా తెలియదని... అయితే, ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లే భావిస్తున్నామని ఆయన వివరించారు. గ్రెనైడ్లతో గేట్లను పేల్చివేసి, సూర్యోదయానికి ముందే విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 2013 సెప్టెంబరులోనూ అల్-షబాబ్ ఉగ్రవాదులు నైరోబీలోని ఒక షాపింగ్‌మాల్‌పై దాడి చేసి 67 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.
గార్డులను చంపి...వర్సిటీలో ప్రవేశించే ముందు ఉగ్రవాదులు ప్రవేశద్వారం వద్ద ఉన్న ఇద్దరు గార్డులను కాల్చివేశారు. అనంతరం వర్సిటీలోని వసతిగృహాల్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. వర్సిటీలో మొత్తం 900 విద్యార్థులు, సిబ్బంది వున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న కెన్యా భద్రతాదళాలు వర్సిటీని చుట్టుముట్టాయి. దుండగుల కోసం వేట ప్రారంభించారు.
బందీలుగా విద్యార్థులు..ఉగ్రవాదులు అనేకమంది విద్యార్థులను బందీలుగా పట్టుకున్నట్టు తెలిసింది. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు.వెనుకబడిన కెన్యా ఉత్తరప్రాంతంలో ఈ గరిస్సా విశ్వవిద్యాలయాన్ని కొద్ది కాలం క్రితమే నెలకొల్పారు.అల్‌షబబ్ హస్తం
ఈ ఘటనకు తామే బాధ్యులమని సొమాలియాకు చెందిన ఉగ్రవాదసంస్థ అల్‌షబబ్ ప్రకటించింది. 2013లోను కెన్యా రాజధాని నైరోబీలో షాపింగ్‌మాల్‌పై జరిగిన దాడికి ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులే పాల్పడ్డారు. అల్‌ఖైదా స్ఫూర్తితో సొమాలియాలో నెలకొల్పిన అల్‌షబబ్అనేకమైన కిరాతక ఉగ్రవాదచర్యలకు పాల్పడింది.
తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ: కెన్యాలో విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై ఇలాంటి దాడికి తెగబడటం అందరినీ నిర్ఘాంత పరిచిందని, దీన్ని పరిపూర్ణంగా ఖండిస్తున్నానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.