రాజకీయ అవినీతిని సహించను:కేసీఆర్

Posted On:03-04-2015
No.Of Views:317

ఆసరా, ఆహారభద్రత, కల్యాణలక్ష్మి, దళితులకు మూడెకరాల భూమి, అమరవీరుల సంక్షేమం, ఉద్యోగులకు పీఆర్‌సీ పది నెలల పాలనలో ఇలా అన్నివర్గాలకు మేలు చేశాం. అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నా విద్య, వైద్యంలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పట్లో ఎన్నికల్లేవు. శాసనసభ సమావేశాల్లేవు. సాకులు చెప్పకుండా పని చేయాలి. ప్రతి పైసా పేదలకు అందేలా కృషి చేయాలి.
నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. భూసేకరణ, పరిహారం ఇతర అంశాలపై దృష్టి సారించాలి. మిషన్ కాకతీయ, జలహారం విజయవంతానికి కృషి చేయాలి. వచ్చే మార్చి నాటికి 8వేల మెగావాట్లకు పైగా అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయానికి పదేసి గంటల చొప్పున కరెంటునిస్తాం. ప్రాజెక్టుల ద్వారా నీరు, అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు బాగా అభివృద్ధి చెందుతాయి. మహిళా స్వయంసహాయక సంఘాలకు రుణసాయం అందించాలి. పథకాల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఐకేపీని మరింత విస్తృతపరిచి, ఉద్యోగుల సేవలను వినియోగించుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. అయిదేళ్లలో రూ.ఆరున్నర లక్షల కోట్లను వెచ్చిస్తామన్నాం. ప్రతి పైసా పేదలకు అందేలా కృషి చేయాలి.
మండలి పట్టభద్ర ఎన్నికల్లో రెండు స్థానాలూ గెలవాల్సింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో దేవీప్రసాద్‌ను బలమైన అభ్యర్థిగా భావించాం. హైదరాబాద్‌లో పట్టు లేకపోయినా ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతుతో గెలుస్తామనుకున్నాను. వారు సహకరించలేదు. నాయకులూ సరిగా పనిచేయలేదు. గతంలో ఓడిపోయారనే సానుభూతి భాజపా అభ్యర్థికి లాభించింది. రాబోయే 12 స్థానికసంస్థల నియోజకవర్గాల ఎన్నికల్లో పది సునాయాసంగా గెలుస్తాం. మరో రెండింటిని దక్కించుకునేందుకు కృషి చేయాలి. హైదరాబాద్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు. పార్టీని పటిష్ఠపరచాలి. త్వరలోనే జీహెచ్ఎంసీలో పర్యటిస్తాను. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను తప్పనిసరిగా గెలవాలి. ఓటుబ్యాంకు రాజకీయాలొద్దు. అన్ని వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం జరగాలి.. అది చూసి ప్రజలు మనల్ని ఆదరించాలి.
మంత్రుల పనితీరుపై నా దగ్గర సమగ్ర నివేదికలున్నాయి. కొంతమంది సమీక్షలు కూడా నిర్వహించకుండా అధికారులపైనే ఆధారపడుతున్నారు. వారు పనితీరు మెరుగుపరుచుకోవాలి. పత్రికల్లో వచ్చే వ్యతిరేక కథనాలపై గాబరా పడొద్దు. వాటి ఉద్దేశాలను గమనించి స్పందించాలి. రాజకీయ అవినీతి అత్యంత ప్రమాదకరం. గతంలో ఇలాంటి అభియోగాలపైనే మంత్రిమండలిలో మార్పులు చేశాను. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించను. ప్రతి ఆరోపణా తీసేయదగ్గది కాదు. తప్పులేకపోయినా, ఉద్దేశపూర్వకంగా చేసినా వాటిని తిప్పికొట్టాలి. పార్లమెంటరీ కార్యదర్శుల జీతభత్యాలు, విధివిధానాలపై త్వరలో ఉత్తర్వులిస్తాం. మంత్రివర్గంలో సర్దుబాటు చేయలేక పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించామే తప్ప వారు మంత్రులతో సమానమే. మీరంతా కలిసి పనిచేస్తూ జిల్లాల్లో పార్టీని పటిష్ఠపరచాలి. గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమించాలి. హైదరాబాద్‌లో ఈ నెల 27న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.