దుస్తుల గదిలో రహస్య కెమెరా

Posted On:03-04-2015
No.Of Views:308

 ఏదైనా షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లినప్పుడు, హోటల్స్‌కి వెళ్లినప్పుడు రహస్య కెమెరాలతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఓ కేంద్ర మహిళా మంత్రికే రహస్య కెమెరాలతో ఇబ్బందులెదురయ్యాయి. దుస్తులను కొనడానికి వెళ్లిన ఆమె.. ట్రయల్‌ రూమ్‌లో ఉన్న రహస్య కెమెరాను సకాలంలో గుర్తించడంతో కెమెరా బండారం బయటపడింది. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ రెండు రోజుల సెలవులను గడపడానికి తన భర్త జుబెన్‌ ఇరానీతో కలిసి గోవా వెళ్లారు. అక్కడ కొన్ని డ్రెస్సులు కొనడానికి కాండోలిమ్‌ పట్టణ సమీపంలోని కాలంగ్యులేట్‌లో ఉన్న ఫ్యాబ్‌ ఇండియా దుస్తుల షాప్‌కి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లారు. దుస్తులను కొన్నతర్వాత వాటిని సరిచూసుకోవడానికి ఆమె ట్రయల్‌ రూమ్‌లోకి వెళ్లారు. దుస్తులు మార్చుకుంటున్న సమయంలో ఆ గది వెంటిలేటర్‌ బయట గోడమీద ఓ రహస్య కెమెరా ఉన్నట్లు ఆమె గమనించారు. దీంతో ఆమె వెంటనే తన భర్తకు సమాచారమందించారు. అంతేకాక స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్‌ లోబోను కూడా పిలిపించారు. ఫ్యాబ్‌ ఇండియా షాప్‌పై లోబో పోలీసులు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ట్రయల్‌ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డయినట్లు గుర్తించామని లోబో వెల్లడించారు.
నాలుగు నెలల క్రితం ఈ కెమెరాను ఏర్పాటు చేసినట్లు తెలిసిందన్నారు. నడుము పై భాగానికి సంబంధించిన దుస్తులను మార్చుకునేటప్పుడు చిత్రీకరించిన అనే దృశ్యాలు ఫుటేజీల్లో బయటపడినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. లోబో ఫిర్యాదు మేరకు ఫ్యాబ్‌ ఇండియా షాప్‌లో సోదాలు నిర్వహించామని, రహస్య కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఉమేశ్‌ గణోంకర్‌ తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 354సీ, 509 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. స్మృతి ఇరానీతోపాటు, ఆ రూంలో అంతకు ముందు దుస్తులు మార్చుకున్న మరో యువతి స్టేట్‌మెంట్‌నూ రికార్డు చేశామని వెల్లడించారు. ప్రస్తుతం ఫ్యాబ్‌ ఇండియాను సీజ్‌ చేశామని, సిబ్బందిని విచారిస్తున్నామన్నారు. ఈ ఒక్క షాప్‌లోనే కాక మొత్తం తీరప్రాంతంలోని అన్ని షాపులలోను సోదాలు చేయనున్నట్లు తెలిపారు. కాగా బెంగళూరులో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ఈ ఘటనపై స్పందించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దొంగతనాలు అరికట్టేందుకేనట!
ట్రయల్‌ రూమ్‌లో కెమెరాల ఏర్పాటును దేశమంతటా నిరసిస్తుంటే ఫ్యాబ్‌ ఇండియా షాపు సిబ్బంది మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. దొంగతనాలను అరికట్టేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కొంతమంది నాలుగైదు రకాల డ్రెస్‌లను ట్రయల్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఒక డ్రెస్‌ను రహస్యంగా పట్టుకుపోతున్నారని అంటున్నారు. అ డ్రస్‌ ఖరీదును షాపు యజమానులు సిబ్బంది జీతాల్లో కోత పెడుతున్నారని.. అందుకే కెమెరాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటున్నారు. అయితే చోరీలను అరికట్టడానికి ఎన్నో మార్గాలుండగా రహస్య కెమెరా ఏర్పాటు చేయడమేమిటనే ప్రశ్నకు జవాబివ్వం లేదు