అమెరికాలో ఏపీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Posted On:03-04-2015
No.Of Views:337

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థిని అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన హజరత్‌బాబు, శివమ్మల మూడో కుమార్తె ఆబ్బూరి లావణ్య(27) బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అలబామా యూనివర్శిటీలో చదువుతోంది.అట్లాంటాలో ఉంటున్న తన బావ అలపర్తి సురేష్‌బాబు, అక్క వెంకటలక్ష్మిలతో రోజు ఫోన్‌లో మాట్లాడుతుండేది. బుధవారం వారు ఆమెకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో యూనివర్సిటీలో విచారించారు. అక్కడికి వచ్చినట్లు రిజిస్టర్‌లో నమోదైనప్పటికీ జాడ తెలియలేదు.గురువారం లావణ్య మృత దేహాన్ని యూనివర్సిటీలోని నీటి కుంటలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని శనివారం బంధువులకు అప్పగిస్తారని సమాచారం.