మీ సైనికులను వెనక్కి పిలవాలి

Posted On:03-04-2015
No.Of Views:329


 నైరోబీ: కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీలో గురువారం 147 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న అల్ షబాబ్ ఉగ్రవాదులు.. సోమాలియాలోని కెన్యా బలగాలను వెనక్కి పిలిపించాలని దాడుల సమయంలో డిమాండ్ చేసినట్లు తెలిసింది. ‘విద్యార్థులను చంపడానికి ముందు.. వారితో వారి తల్లిండ్రులకు ఫోన్ చేయించి కెన్యా సైనికులు సోమాలియా నుంచి తిరిగిరావాలని చెప్పాలన్నారు’ అని ఊచకోత నుంచి తప్పించుకున్న బాధితులు చెప్పారు. ‘సోమాలియా నుంచి సైనికులను మీ అధ్యక్షుడు ఉపసంహరించిన రోజునే మీరు సురక్షితంగా ఉంటారు’ అని ముష్కరులు  చెప్పారని 21 ఏళ్ల మారీన్ మాన్యెంగో అనే విద్యార్థిని చెప్పింది.
దాడుల సమయంతో తాను బీరువాలో దాక్కునట్లు చెప్పింది. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి కొందరు విద్యార్థులు మృతిచెందిన తమ స్నేహితులు నెత్తురు పూసుకుని చనిపోయినట్లు నటిం చారు. గురువారం వర్సిటీలో ఎదురు దాడిలో నలుగురు ఉగ్రవాదులను చంపిన బలగాలు మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఛిద్రమైన మృతదేహాలతో వర్సిటీ క్యాంపస్ భయానకంగా కనిపించింది. దాడితో వర్సిటీ విద్యార్థులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడబోమని కెన్యా  పేర్కొంది.  గరిస్సా వర్సిటీలో కైస్తవ విద్యార్థులను లక్ష్యం చేసుకున్న ఈ దాడిని పోప్ ఫ్రాన్సిస్  ఖండించారు.