ఏడు ఎడిషన్లలో విండోస్ 10

Posted On:15-05-2015
No.Of Views:276

 హైదరాబాద్ : త్వరలో మార్కెట్‌లోకి రానున్న 'విండోస్ 10'కు సంబంధించిన మరిన్ని వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ సరికొత్త వెర్షన్ ఎన్ని ఎడిషన్లలో విడుదలవుతుందన్న సందేహాలకు మైక్రోసాఫ్ట్ తెర దించింది. అన్నివర్గాలకు ఉపయోగపడేలా ఏడు ఎడిషన్లలో ఈ ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.అన్ని రంగాల్లో స్మార్ట్‌ఫోన్లు.. టాబ్లెట్ల వినియోగం గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈసారి మొబైల్ ఎడిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠశాలలు.. విద్యార్థుల కోసం ప్రత్యేక ఎడిషన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.ఇన్నాళ్లూ డెస్క్‌టాప్ ఎడిషన్లకే ప్రాధాన్యం ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. బహుళ అవసరాలకు అనుగుణంగా విండోస్ 10ను ఏడు ఎడిషన్లలో విడుదల చేయనుంది. వ్యక్తిగత అవసరాలు.. చిన్న తరహా వ్యాపారాల నుంచి బహుల జాతి సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుగుణంగా ఈ ఎడిషన్లను తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రతినిధి టోనీ ఫ్రోఫెట్ వెల్లడించారు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విండోస్ 7.. 8.. 8.1 వెర్షన్ల వినియోగదారులు విండోస్ 10కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
విండోస్ 10 ఎడిషన్లు.. 
* విండోస్ 10 హోమ్: అన్ని రకాల డెస్క్‌టాప్ కంప్యూటర్లు.. టాబ్లెట్ పీసీల కోసం.
* విండోస్ 10 మొబైల్: స్మార్ట్‌ఫోన్లు.. టాబ్లెట్లలో మాత్రమే పని చేస్తుంది. 
* విండోస్ 10 ప్రో: చిన్న సంస్థల నిర్వహణ కోసం. 
* విండోస్ 10 ఎంటర్‌ప్రైజ్: భారీ సంస్థల కార్యకలాపాల కోసం. ఇందులో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తోంది. 
* విండోస్ 10 మొబైల్ ఎంటర్‌ప్రైజ్: స్మార్ట్‌ఫోన్లు.. టాబ్లెట్ల ద్వారా వ్యాపార కార్యకలాపాల కోసం. 
* పాఠశాలల్లో ఆధునిక విద్యాబోధన కోసం డిజిటల్ తరగతుల నిర్వహణ.. తదితర అవసరాలకు అనుగుణంగా 'విండోస్ 10 ఎడ్యుకేషన్' పేరుతో ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేస్తోంది.
*అదే విధంగా ఇంటర్నెట్.. సర్వర్ల నిర్వహణ కోసం 'విండోస్ 10 లాట్ కోర్'ను తీసుకొస్తున్నట్లు ప్రోఫెట్ పేర్కొన్నారు.