విదేశాలకు మన హైదరాబాద్ ఉస్మానియా బిస్కెట్లు

Posted On:15-05-2015
No.Of Views:310

 హైదరాబాద్‌ బిర్యాని, హైదరాబాద్ హలీమ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. ఇప్పుడా కోవలోకి నగరానికి చెందిన ఉస్మానియా బిస్కెట్లు కూడా చేరనున్నాయి. ఇప్పటికే ఈ ఉస్మానియా బిస్కట్లను ముంబై, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని పుడ్ లాంజీల్లో ప్రయాణీకులకు అందిస్తున్నారు. నగరానికి చెందిన అతి పురాతనమైన బేకరీని నిర్వహిస్తున్న సయ్యద్ ఇర్పాన్ మాట్లాడుతూ ఉస్మానియా బిస్కట్లకు ప్రపంచ ఖ్యాతి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా విదేశాల్లో ఉస్మానియా బిస్కట్లను తయారు చేసే యూనిట్లను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు రిటైలర్లు ఈ బిస్కట్ల తయారీ కేంద్రాలను అక్కడ నెలకొల్పాని కోరుతున్నట్లు ఇర్పాన్ పేర్కొన్నారు. ఇదే గనుక జరిగితే రాబోయే రోజుల్లో ఉస్మానియా బిస్కెట్లు హైదరాబాద్ బిర్యాని, హలీమ్ మాదిరి ప్రపంచ స్ధాయి గుర్తింపుని తెచ్చుకుంటాయి. ఈ బిస్కట్లను తొలి సారి చివరి హైదరాబాద్ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోరిక మేరకు తయారు చేశారు. చివరి నిజాం ఒక రోజు స్నాక్స్‌లో భాగంగా కొంచెం తీరి మరికొంచెం సాల్ట్‌గా ఉండేలా ఏమైనా తయారు చేయమని కోరడంతో ఈ బిస్కట్లను తయారు చేశారు. మొట్టముదటి సారి ఈ బిస్కట్లను అబిడ్స్‌లో ఉన్న బేకరీలో తయారు చేశారు. ఉస్మాన్ కోరిక మేరకు ఈ బిస్కెట్లు తయారు చేయబడ్డాయి కాబట్టి 'ఉస్మానియా బిస్కెట్లు' అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. నేడు, నగరంలో సాయంత్రం ఛాయ్‌లోకి ఈ బిస్కెట్లు లేకుండా అసంపూర్తిగా ఉంటుంది. ఇరాన్ ఛాయ్‌లోకి ఉస్మానియా బిస్కెట్ తింటుంటే ఆ మజానే వేరు.