జయలలితను కాపాడిన ఎన్టీఆర్ ఉత్తర్వు

Posted On:15-05-2015
No.Of Views:261

 హైదరాబాద్: సుప్రీంకోర్టు ఓ సందర్బంలో ఇచ్చిన తీర్పు మాత్రమే కాకుండా గత ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అండగా వచ్చింది. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ప్రస్తావించి, జయలలితను నిర్దోషిగా ప్రకటించింది. చిరు ఉద్యోగులను కాపాడేందుకు అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు జయలలిత పాలిట వరంగా మారింది. ముఖ్యమంత్రి కూడా పబ్లిక్ సర్వెంట్ కిందికి వస్తారు కాబట్టి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును జయలలితకు కూడా వర్తింపజేస్తూ కర్ణాటక హైకోర్టు ఉదహరించింది. జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులో కర్ణాటక హీకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఆర్ కుమార స్వామి రెండు ఉదంతాలను ప్రస్తావించారు. వాటి ఆధారంగా జయలలితపై మోపిన అభియోగాలను కొట్టేశారు. జస్టిస్ కుమార స్వామి ఉదహరించిన రెండు ఉదంతాల్లో ఒకటి - కృష్ణానంద్ అగ్నిహోత్రి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాగా రెండోది - ఎన్టీరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన ఉత్తర్వు. 1989 ఫిబ్రవరి 13వ తేదీన అవినీతి నిరోధక శాఖకు మార్గదర్శకాలను జారీ చేశారు. అలా జారీ చేసిన మెమో నెంబర్ 700/ఎస్‌సి, డి 88-4 ప్రకారం కూడా జయలలిత దగ్గర ఉన్న అదనపు ఆస్తి అక్రమ ఆస్తి కాదని న్యాయమూర్తి చెప్పారు. 1983లో ఎస్ తిరుమలయ్య అనే అధికారి వద్ద అక్రమాస్తులు ఉన్నాయంటూ ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వుల ఆధారంగా తిరమలయ్య కేసును ఎపి హైకోర్టు కొట్టేసింది. ఉద్యోగుల వద్ద కొద్దిపాటి ఎక్కువ ఆస్తి ఉన్నంత మాత్రాన అక్రమాస్తులుగా చూపి వారిని ఇబ్బందులకు గురి చేయకూడదనే ఉద్దేశంతో ఆ ఉత్తర్వులను తెచ్చారు. ఆ ఉత్తర్వు ప్రకారం - ప్రభుత్వాధికారి తన మొత్తం ఆదాయంలో 20 శాతం అధిక ఆస్తి కలిగి ఉన్నా దాన్ని అక్రమాస్తిగా పరిగణించాల్సిన అవసరం లేదు. తిరుమలయ్య కేసును విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పటికి ఆరేళ్ల క్రితం నమోదైన కేసుకు తాజా ఉత్తర్వులను వర్తింపజేస్తూ తీర్పు చెప్పింది. అదే తీర్పును సోమవారంనాడు జస్టిస్ కుమారస్వామి ప్రస్తావిస్తూ - జయలలిత ఆదాయం రూ.34.76 కోట్లు కాబట్టి అందులో పది నుంచి 20 శాతం వరకు అదనపు మొత్తం ఉన్నా ఎపి ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం అక్రమాస్తిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు. కృష్ణానంద్ అగ్నిహోత్రి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చింది. నిందితుని వద్ద లభించిన ఆస్తి విలువ అతని ఆదాయంలో పది శాతం కన్నా తక్కువగా ఉంటే దాన్ని అక్రమాస్తిగా పరిగణించాల్సి పని లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ లెక్కన జయలలిత వద్ద ఆదాయానికి మించి రూ.3.47 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అదనంగా ఉన్నా అది అక్రమార్జన కాదని అర్థం. న్యాయమూర్తి తన సొంత లెక్కల ప్రకారం జయలలిత ఖర్చును అప్పటికే రూ.2.82 కోట్లకు తగ్గించేశారు. అంటే, ఆమె వద్ద ఉన్న అదనపు మొత్తం కనీసం పది శాతం కూడా కాదు. కాబట్టి ఆ రెండు తీర్పుల ప్రకారం జయలలితను నిర్దోషిగా కర్ణాటక హైకోర్టు ప్రకటించింది.