జల మండలి నిర్లక్ష్యానికి ప్రతీక

Posted On:15-05-2015
No.Of Views:336

ఎల్బీనగర్‌: మన్సూరాబాద్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఒక జర్నలిస్టు ఇంట్లో జలమండలి వారు కొత్త కనెక్షన్‌ ఇచ్చి పదిరోజుల వ్యవధిలో కనెక్షన్‌ను కట్‌ చేశారు. ఇదేమని అడిగితే..పాత ఇంటి ఓనర్‌ బకాయిలున్నాడని, అవి కడితేనే కనెక్షన్‌ ఇస్తామని చల్లగా చెప్పారు.
 ఇల్లు కొన్నతర్వాత ఎలాంటి కనెక్షన్‌ లేదు. ఆ ఇంటినెంబర్‌పై నల్లా లేదు. అన్నీ నాలుగుసార్లు వెరిఫై చేసుకున్న తర్వాతే కనెక్షన్‌ మంజూరు చేసి, ఎవరో ఫిర్యాదు చేశారంటూ ఇప్పటి వరకు నాలుగైదు సార్లు ఇంటి ముందు జలమండలి సిబ్బంది తవ్వారు. సదరు బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరంకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాడు. అయితే జలమండలి జిఎం,మేనేజర్‌, ఏరియా సిబ్బంది మొత్తం పది మంది వచ్చి, మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టారు. స్టే ఉంది కదా..మళ్లీ ఎందుకు తవ్వుతున్నారని ఇంటి ఓనర్‌ ప్రశ్నిస్తే, కోర్టులో కనెక్షన్‌ ఉందో లేదో చెప్పుకోవాలి కదా అని జిఎం సమాధానమిచ్చారు.
 తప్పు చేయడమెందుకు..దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమెందుకు? పాత కనెక్షన్‌ ఉన్నట్లయితే ఇన్నాళ్లు అంటే పదిహేనేళ్లు ఒక్క నోటీసు ఎందుకివ్వలేదు.అక్రమ కనెక్షన్లకు ఐదువందలు తీసుకొని వాటిని పునరుద్ధరించిన అధికారులు, ఎలాంటి బకాయిలు లేకపోయినా వేధించడం సబబేనా? జలమండలి ఎం.డి దీనిపై స్పందించి, మామూళ్లు ఇవ్వలేదని,కనెక్షన్‌ కట్‌ చేసిన అధికారులపై చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.