ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు :రాహుల్‌

Posted On:16-05-2015
No.Of Views:266

 నిర్మల్:  ఏడాది పాలనలో అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్రప్రభుత్వం గానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు ఏ మాత్రం భయం వద్దని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, పార్లమెంటు నుంచి ప్రజాక్షేత్రం దాకా వారి కోసం పోరాడుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాందా మండలం వడ్యాలలో శుక్రవారం రైతు భరోసాయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''దిల్లీలో నరేంద్ర మోదీ ఉంటే ఇక్కడ చిన్న (మినీ) మోదీ ఉన్నారు. ఆయన భారత దేశాన్ని, ఈయన తెలంగాణను మార్చేస్తామన్నారు. కానీ వారు పేదలను మర్చిపోతున్నారు. వర్షాలు, వడగండ్ల వానలు వచ్చినా రైతులను పరామర్శించడానికి వారికి సమయం లేదు. మోదీ మద్దతు ధర పెంచుతామన్నారు. కేసీఆర్ రుణమాఫీ అన్నారు. ఇద్దరూ ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు వచ్చి ఏడాది అయింది. ఎవరికైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా... రానేలేదు. నేను రైతు పరామర్శలకు రావడాన్ని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. మోదీ, కేసీఆర్‌లు రైతుకుటుంబాలను పరామర్శిస్తే నాకు రావాల్సిన పనిలేదు. వాళ్లు రైతులను దరిచేర్చుకుంటే నాకు వారిని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు కొంతమందికే పరిమితమయ్యాయి. మోదీకి అయిదారుగురు బడా పారిశ్రామికవేత్తలైన మిత్రులున్నారు. ఆయనతో పాటే వారు విదేశాలకు వెళ్తున్నారు. మొత్తం భారతదేశాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, సూటుబూటుల ప్రభుత్వమని పార్లమెంటులో చెప్పాను. మోదీ మంచిరోజులొస్తాయని ఎప్పుడూ చెబుతున్నారు. వాస్తవానికి ఆయనకు, ఆయన సన్నిహితులైన కొంత మంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే మంచి రోజులొచ్చాయి. ఈ రోజు చైనాలో ఉన్నారు. ఇటీవలే అమెరికా, ఆస్ట్రేలియా వెళ్లి వచ్చారు. మీలో ఎవరైనా 10 లక్షల రూపాయల సూటు వేసుకున్నారా? మోదీ వేసుకుంటారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులు, రైతుకూలీలకు, చిన్న వ్యాపారులకు ఎలాంటి మేలు జరగలేదు. వీలైనంత త్వరగా తమకు కావాల్సిన పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టాలని యత్నిస్తున్నారు. ఉపాధి కల్పిస్తామని, మేక్ ఇన్ ఇండియా చేస్తామని అంటున్నారు. కానీ ఏమీ జరగడం లేదు. రైతులు ఆరుగాలం శ్రమించి, రక్తమాంసాలను ధారపోసి మనకు అన్నం పెడుతున్నారు. యూపీఏ రైతుల మేలు కోసం... వారిని అడిగే భూమి తీసుకోవాలని, సామాజిక తనిఖీ ఉండాలనే అంశాలతో భూసేకరణ చట్టాన్ని తెస్తే ఎన్‌డీయే ప్రభుత్వం వాటిని తొలగించి, కొత్త బిల్లును ఆమోదించుకోవాలని ప్రయత్నిస్తోంది. రైతులు ఏ మాత్రం భయపడొద్దు. మీ తరపున కాంగ్రెస్ పోరాడుతుంది. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం. పార్లమెంటుతో పాటు ప్రజాక్షేత్రంలోనూ ఎక్కడంటే అక్కడ ఉద్యమిస్తాం. మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. రైతుల భూములను బలవంతంగా లాక్కోకూడదు. పారిశ్రామికవేత్తలు గానీ, రైతులు గానీ ఒంటరిగా దేశాన్ని అభివృద్ధి చేయలేదు. వారు కలిసి మెలిసి ముందుకెళ్లారు. తమకు సన్నిహితులైన ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకే మొత్తం భూములను కట్టబెట్టాలనే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తాం. రైతులు, కూలీలు, పేదలు అందరికీ వాళ్ల హక్కులు దక్కాలి. మేం ప్రత్యేక ఆర్థిక మండళ్లను చేపట్టాం. కేవలం ఎనిమిది శాతం ప్రాజెక్టులే భూముల్లేక ఆగిపోయాయి తప్ప మిగిలిన వాటికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు భూమి అంటే బంగారం. దాని ధర రూ.వేల నుంచి లక్షలకు, లక్షల నుంచి కోట్లకు చేరింది. భవిష్యత్తులో ఒక్కో ఎకరం ధర 15 కోట్లు వరకు పలుకుతుంది. మీకు, మీ పిల్లలకు అది శాశ్వతంగా ఉపయోగపడుతుంది. రైతులకు అన్ని విధాల సహకారం అవసరం. ఈ ప్రభుత్వాల పనితీరు చూసి తాము వాటిని ఎన్నుకొని తప్పు చేశామని ప్రజలు బాధ పడుతున్నారు.'' అని రాహుల్ పేర్కొన్నారు.