మనస్నేహం అవసరం: మోదీ

Posted On:16-05-2015
No.Of Views:264

''చైనా ప్రపంచ కర్మాగారం అయితే.. భారత్ ప్రపంచ కార్యాలయం. మీరు హార్డ్‌వేర్‌కు అధికప్రాధాన్యమిస్తే మేం సాఫ్ట్‌వేర్‌కు, సేవలకు ప్రాముఖ్యతనిస్తాం''
భారత్‌లో వీస్తున్న మార్పు పవనాలను అందిపుచ్చుకోవాలని చైనా పెట్టుబడిదారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ''చైనా కంపెనీలకు ఇదొక చరిత్రాత్మక అవకాశం. వ్యాపారవాణిజ్యాలకు అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పటానికి మేం కట్టుబడిఉన్నాం. భారత్‌లోకి రావాలని మీరొకసారి నిర్ణయించుకుంటే చాలు.. మీరు సౌఖ్యంగా ఉండేలా చూసుకుంటాం'' అని పేర్కొన్నారు. చైనా పర్యటనలో చివరిరోజైన శనివారం.. ఆ దేశ వాణిజ్యకేంద్రం షాంఘైలో 'ఇండో-చైనా వ్యాపారమండలి' ఏర్పాటుచేసిన సదస్సులో మోదీ మాట్లాడారు. ఆసియాఖండం ఆర్థికాభివృద్ధి, రాజకీయస్థిరత్వం కోసం భారత్-చైనా మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం తప్పనిసరి అవసరమని మోదీ చెప్పారు. భారత్‌లో ఆర్థికవాతావరణం మారిందని నియంత్రణవ్యవస్థ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా తయారైందని చెప్పారు. ఇరుదేశాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సహకారం ఎంతో అవసరమన్నారు. చైనాలాగే తయారీరంగాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు పేర్కొంటూ 'భారత్‌లో తయారుచేయండి' పథకాన్ని మోదీ వివరించారు. ప్రభుత్వపరంగా తాము తీసుకున్నచర్యల వల్ల ఏడాదికాలంలో భారత్‌లోకి విదేశీప్రత్యక్షపెట్టుబడులు 39శాతం పెరిగాయని తెలిపారు.
సదస్సులో మాట్లాడటానికి ముందు ప్రధాని మోదీ.. చైనాకు చెందిన 22 అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలను కలుసుకున్నారు. వీరిలో అలీబాబా, చైనాలైట్ అండ్ పవర్, షియాఓమి, హువావీ, త్రినాసోలార్ వంటి భారీసంస్థల అధిపతులున్నారు. సదస్సు సందర్భంగా ఇరుదేశాల కంపెనీల మధ్య 2,200 కోట్ల డాలర్ల (రూ.1,39,573 కోట్లు) విలువైన 26 ఒప్పందాలు కుదిరాయి. చైనా అభివృద్ధి బ్యాంకు, చైనా పారిశ్రామిక వాణిజ్య బ్యాంకులతో భారతీఎయిర్‌టెల్, గోల్డెన్ కాంకార్డ్ హోల్డింగ్స్, గ్వాంగ్జౌ నౌకాశ్రయసంస్థలతో అదానీగ్రూపు, క్విన్నాన్ ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. విద్యుత్తు, ఉక్కు, చిన్న/మధ్యతరహా పరిశ్రమలు, సంప్రదాయేతర ఇంధన వనరులు తదితర అంశాలకు సంబంధించి ఈ ఒప్పందాలున్నాయి.

పని చేసినా విమర్శలేనా? 
ఎవరైనా పని చేయకుంటే విమర్శలొస్తాయిగానీ తన విషయంలో దురదృష్టంకొద్దీ.. తీరికలేకుండా పని చేస్తున్నాకూడా విమర్శలే ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. షాంఘైలో 5,000మంది భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏడాదిక్రితం లోక్‌సభ ఎన్నికలఫలితాలు వెలువడిన తర్వాత.. అలుపులేకుండా పని చేయాలని, అనుభవం లేదు కాబట్టి నేర్చుకోవాలని, దురుద్దేశ్యంతో ఎటువంటి తప్పూ చేయకూడదని అనుకున్నానని మోదీ వెల్లడించారు. ఈ మూడింటినీ తాను నెరవేర్చానని పేర్కొంటూ.. ఇప్పటివరకూ ఒక్కరోజుకూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని చెప్పారు. తరచూ విదేశీపర్యటనలకు వెళ్లటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పరోక్షంగా తిప్పికొడుతూ.. నిరంతరం పని చేయటమే నేరం అయితే.. ఆ నేరాన్ని కొనసాగిస్తానని మోదీ స్పష్టంచేశారు. గతప్రభుత్వాలు 30 ఏళ్లలో చేసిన పనిని తాను తొలిఏడాదిలోనే చేయటానికి ప్రయత్నించానని, దీనివల్లే ప్రపంచం తనను నమ్ముతోందని తెలిపారు. చైనా, భారత్‌లలో మూడోవంతు ప్రపంచజనాభా నివసిస్తోందని.. ఈ రెండుదేశాలూ చేతులుకలిపితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయన్నారు. చైనాలో ఉన్న ప్రతీభారతీయుడు ఏటా కనీసం ఐదుగురు చైనీయులు భారత్‌ను సందర్శించేలా ఒప్పించాలని సూచించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తనకున్న స్నేహాన్ని 'ప్లస్‌వన్'గా మోదీ అభివర్ణించారు.
షాంఘైలోని ఫూదన్ విశ్వవిద్యాలయంలో గాంధీజీ-భారత్ అధ్యయనాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు. భూతాపం, ఉగ్రవాదం అనే ప్రధానసంక్షోభాలను ప్రపంచం ఎదుర్కొంటోందని, వీటికి పరిష్కారం మహాత్మాగాంధీ బోధనల్లో ఉందని తెలిపారు. విజ్ఞానానికి ప్రాంతాల పరిమితులు ఉండవని, ఏ తరహా విజ్ఞానమైనా మానవాళికి మేలు చేస్తుందన్నారు. ఫలితాలను పట్టించుకోకుండా కర్తవ్యం నిర్వహించాలన్న భగవద్గీత బోధనను ప్రధాని ప్రస్తావించారు. చైనా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ శనివారం మంగోలియా చేరుకున్నారు.