పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీకి మరణశిక్ష

Posted On:16-05-2015
No.Of Views:291

కైరో: పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ తదితరులకు సంబంధిత కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. ఈజిప్టులో 2011లో ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు సందర్భంగా భారీఎత్తున మూకుమ్మడిగా జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన కేసులో మోర్సీతో పాటు నిషేధిత ''ముస్లిం బ్రదర్‌హుడ్'' సారథి మహమ్మద్ బడీ....వందకుపైగా ఆ సంస్థ సభ్యులకు కూడా మరణశిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. వీరంతా 2011 జనవరిలో జైలు భవనాలకు నిప్పుపెట్టి...వాటిని దారుణంగా ధ్వంసంచేసి...హత్యలకు పాల్పడి, హత్యా యత్నాలు చేసి...కారాగార డిపో నుంచి ఆయుధాలను అపహరించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 2011లో జనవరి నెలలో ఈజిప్టులోని మూడు కారాగారాల నుంచి 20వేలకు పైగా ఖైదీలు పారిపోయారు. తదనంతర పరిణామాలు నాటి ఈజిప్టు ఉక్కుమనిషిగా పేర్కొందిన హోస్నీ ముబారక్‌ను పదవీచ్యుతుడిని చేశాయి. వాస్తవానికి ఒక కుట్రకేసులో మోర్సీ అరెస్టయ్యారు. పాలస్తీనాకు చెందిన హమస్‌తో పాటూ పలు విదేశీ తీవ్రవాద బృందాలతో కలిసి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో మోర్సీ తదితరులను పోలీసులు అప్పట్లో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన...పలువురితో కలిసి జైళ్ల నుంచి తప్పించుకుని పారిపోయారు. కేసులో మోర్సీ(63) తనకు మరణశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించగానే... దానిని వ్యతిరేకిస్తున్నట్లుగా మోర్సీ పిడికిళ్లు బిగించి చేతులను పైకిలేపారు.