తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి..!

Posted On:17-05-2015
No.Of Views:298

తెలంగాణలో పదవ తరగతి పరిక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆదివారం ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి  వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో బాలురు 76.11 శాతం, బాలికలు 79.04 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేటుగా పరీక్ష రాసిన వారిలో 54 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారన్నారు. ఈ పరీక్షల్లో వరంగల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ జిల్లాలో పరీక్షలు రాసిన వారిలో 91.6 శాతం మంది పాస్ కాగా, ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచి 54.9 శాతంతో సరిపెట్టుకుందని తెలిపారు. వీరందరికీ ఈ నెల 25లోగా మార్కులు సంబంధిత పాఠశాలలకు పంపుతామని కడియం వివరించారు. అదేవిధంగా ఈ సంవత్సరం 1,491 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, 28 పాఠశాలలు జీరో రిజల్ట్స్ నమోదు చేశాయని తెలిపారు.  ఇంకా జూన్ 18 నుంచి జూలై 2 వరకూ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం మే నెల 30వ తేదీ లోపు ఫీజులు చెల్లించాలని కడియం సూచించారు. అంతేకాకుండా ఈ తేదీలను పొడిగించడానికి వీలు కాదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలు ర్యాంకులను ప్రకటించుకుంటూ ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 కాగా పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు.