విశ్వవిద్యాలయాలకు 500 ఎకరాలు ఎందుకు..?:ముఖ్యమంత్రి కేసీఆర్

Posted On:19-05-2015
No.Of Views:271

 హైదరాబాద్:రాజధానిలోని విశ్వవిద్యాలయాల భూములను కచ్చితంగా తీసుకొని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టం చేశారు. పేదలకు న్యాయం చేసే విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినా.. ఎవరు ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆ స్థలాలను వేరే ప్రయోజనాలకు కాకుండా వందశాతం పేదల సంక్షేమం కోసమే వినియోగిస్తామన్నారు. సికింద్రాబాద్, ఎల్ఎన్‌నగర్, ఈశ్వరీభాయినగర్, బౌద్ధనగర్‌లలో మంగళవారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కాలనీల్లో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ.. 'ఒక పని మొదలు పెట్టిన తర్వాత మధ్యలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను మొండిమనిషిని. అనుకున్నది సాధించేదాకా వెంబడిపడతా. దాని కథో, నా కథో తేలాలి. బస్తీలు తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారు. పేదలకు ఇళ్లు, ఆసుపత్రులు, కళాశాలలు కట్టించాలి. ఇవన్నీ చేయాలంటే జాగా కావాలే. కేసీఆర్ ఉఫ్ అని వూదేస్తే జాగా పుట్టుకొస్తదా..? ఎక్కడో ఓ చోట నుంచి సర్దాలి. ఎలా చేయాలో చెప్పరు కానీ అనవసరంగా రాద్ధాంతం చేస్తరు. ఉస్మానియా భూముల్ని తీసుకొని పేదోళ్లకు ఇళ్లు కడతానంటే కొందరు నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నరు. రాజకీయ నాయకులు వాళ్లని భుజానికెత్తుకుని మోస్తున్నరు. పేదోళ్లకు ఇళ్లు కట్టొద్దంటున్నరు. నిజాం నవాబు వ్యవసాయ వర్సిటీకి 5వేల ఎకరాలు, ఉస్మానియా వర్సిటీకి 2,500 ఎకరాలు ఇచ్చారు. గీ జమానాల యూనివర్సిటీలకు వందల ఎకరాలు ఎందుకు..? తెలంగాణాలో హార్టీకల్చర్ యూనివర్సిటీకి 500 ఎకరాలు కావాలని కేంద్రం కోరితే యాభై ఎకరాలు చాలని నేను ప్రధాని మోదీకే చెప్పాను. ఆయన కూడా నిజమే అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏడున్నర వేల మందికి ఇళ్లు కట్టియ్యాలే. ఇక్కడ భూములెక్కడున్నయ్..? అందుకే ఉస్మానియా భూముల్లో కొంత తీసుకొంటాం. గత పాలకులు రేస్‌కోర్సులకు, గోల్ఫ్ క్లబ్బులకు, పేకాట క్లబ్బులకు వందల ఎకరాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు గరీబోళ్లకు ఇస్తమంటే చిల్లర రాజకీయాలు చేస్తున్నరు. వాళ్లు కూడా మనలాగ పుట్టిన మనుషులే. అదృష్టం బాగా లేక పేదలుగా పుట్రిండ్రు. వాళ్లు బతుకంతా అట్లనే గడపాల్నా..? ఆకలితో ఉన్నోడికి రెండు ముద్దలు పెట్టాలని వేదాలు చెబుతున్నాయి. ఆ సంస్కారం ఏమైంది..? నేను నాలుగేళ్లు ఉంటా. ఈ నాలుగేళ్లు స్వచ్ఛ హైదరాబాద్ కొనసాగుతది. నగరంలో రెండు లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి తీరతా. ఈ డివిజన్‌కు నేనే ఇంఛార్జిగా ఉన్నా. రూ.200 కోట్లయినా ఇస్తా' అని వివరించారు.
సఫాయన్నా.. నీకు సలాం: నగర వీధుల్ని శుభ్రంగా ఉంచుకోవాలనే చెబుతూ ముఖ్యమంత్రి చెత్త శుభ్రం చేసే కార్మికులనుద్దేశంచి సఫాయన్నా.. నీకు సలాం అంటూ స్తుతించారు. 'పార్శీ గుట్టలో ఒక్క రోజు చెత్త ఎత్తితేనే నాకు ఎట్లనో అయింది. ఇంటికి పోయినంక డాక్టర్‌నడిగి యాంటీబయాటిక్స్ వేసుకున్న. సఫాయి కార్మికులు రోజూ చెత్త ఎత్తుతున్నరు. నిజంగా అది మామూలు సేవ కాదు. మురికిని వారు భరిస్తూ మనకు శుభ్రతను పంచుతున్నారు..' అని కితాబిచ్చారు. దేశంలోనే అయిదు అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటని ..నగరాన్ని మనమే తెలివితక్కువతనంతో 40డిగ్రీల ఉష్ణోగత్ర వరకు తెచ్చుకున్నం. రేపటి తరాలకు వరాలిచ్చేలా నగరాన్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు.జీహెచ్ఎంసీ ఎన్నికలపై సంకేతం: కేసీఆర్ బౌద్ధనగర్ కమ్యూనిటీ హాలులో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలపై సంకేతమిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వెచ్చింపు గురించి మాట్లాడుతూ.. 'ఇప్పుడేం ఎన్నికలు లేవు. పది నెలల తర్వాత ఫిబ్రవరి, మార్చిలో జీహెచ్ఎంసీ ఎన్నికలుంటాయి..' అన్నారు.