ఆర్టీసీ బస్సులు ఢీకొని నలుగురి దుర్మరణం

Posted On:19-05-2015
No.Of Views:310


మృతుల్లో నాలుగు నెలల పసికందు
అనుచిత ప్రవర్తన, అపరిమిత వేగం దుర్ఘటనకు నేపథ్యం!
మహబూబ్‌నగర్, న్యూస్‌టుడే: బాధ్యత మరచిన ఓ డ్రైవర్ విపరీత ధోరణి నెలల పసిబిడ్డతో సహా నలుగురి నిండుప్రాణాలు బలిగొంది. అనేకమందిని గాయాలపాలు చేసింది. మహబూబ్‌నగర్‌జిల్లా, చౌదర్‌పల్లి సమీపంలో మంగళవారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో 18మంది గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు రాయచూర్ వైపు నుంచి మహబూబ్‌నగర్ వస్తుండగా.. రాయచూర్ వెళ్తున్న కర్ణాటక బస్సు డ్రైవర్ భగవాన్ నోట్లోని గుట్కా ఉమ్మేందుకు చౌదర్‌పల్లి వద్ద తల బయటకు పెట్టాడు. దీంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న హైదరాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో దాని పక్కభాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో బస్సు కిటికీ పక్కన కూర్చొన్న హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన హసీనాబేగం(25) సీట్ల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా వూట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బాలమ్మ(28), ఆమె నాలుగు నెలల పసికందు అజయ్, మరికల్‌కు చెందిన సోహెల్(14) తీవ్రంగా గాయపడి చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. రెండు బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మరో 14మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రాణాలు తీసిన పాన్‌మసాలా: కర్ణాటక డ్రైవర్ అనుచిత ధోరణి, అపరిమిత వేగం ప్రమాదానికి కారణమైందని మహబూబ్‌నగర్ పోలీసులు చెప్పారు. ఒకపక్క పాన్ మసాలా తింటూ, పదేపదే తలను బయటకు ఉమ్ముతూ బస్సును అతివేగంగా నిర్లక్ష్యంగా నడపటం ప్రమాదానికి దారితీసినట్లు వారు పేర్కొన్నారు. బస్సులోని ప్రయాణికులు హెచ్చరిస్తున్నా అతనేమాత్రం వినిపించుకోలేదన్నారు.
రవాణా మంత్రి పరామర్శ: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. వారికి తక్షణ ఆర్థికసాయం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల వంతున పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. మృతుల కుటుంబసభ్యులు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పట్టుబట్టగా.. అసహనానికి గురైన మంత్రి 'చేయాల్సింది చేశాను. తర్వాత ఏమైనాఉంటే చూద్దాంలే' అంటూ కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు. తర్వాత బాధితులు పరిహారం పెంచాలని శాసనసభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఆర్టీసీ ఈడీ పురుషోత్తంలను డిమాండ్‌చేశారు. ఎమ్మెల్యే.. మంత్రి, ఉన్నతాధికారులతో మాట్లాడి ఒప్పించడంతో మృతులకుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.