తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ను మరింత విస్తరించండి

Posted On:19-05-2015
No.Of Views:272

హైదరాబాద్: తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ను మరింతగా విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను కోరారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కొన్నిరోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి... సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ (టాస్క్), టీహబ్‌ల గురించి కేటీఆర్ ఆయనకు చెప్పారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన బిద్రీవేర్ కళాకృతిని సత్య నాదెళ్లకు బహుకరించారు. అనంతరం సీయాటెల్‌లోని అమెజాన్ క్యాంపస్‌ను సందర్శించి, సంస్థ సంచాలకులు జాన్ స్కాట్లర్, ఉపాధ్యక్షుడు మోనిక్ మెషీతో సమావేశమయ్యారు. అమెజాన్ కంపెనీని రాష్ట్రంలో మరింతగా విస్తరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేటీఆర్ వారిని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా కదులుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రభుత్వంతో కలిసి మరింత విస్తృతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సీయాటెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు ఏరిక్ షీన్‌షీల్డ్‌తోనూ మంత్రి సమావేశమయ్యారు. అంతకుముందు అక్కడ ప్రవాస భారతీయ, తెలంగాణ సంస్థల ప్రతినిధులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.