మహిళను కాపాడలేకపోయిన 11 మంది పోలీసులకు ఏడాది జైలు

Posted On:19-05-2015
No.Of Views:268

 హైదరాబాద్: ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో గత మార్చిలో కొందరు వ్యక్తులు ఓ మహిళపై దాడి చేసి దారుణంగా చంపేసిన ఘటనలో మంగళవారం కోర్టు పదకొండు మంది పోలీసులకు ఏడాది జైలు శిక్ష విధించింది. 27ఏళ్ల ఫర్‌కుందా అనే మహిళ మత గ్రంథం ప్రతిని తగలబెట్టిందన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు ఆమెను దారుణంగా కొట్టి, నిప్పంటించి కిరాతకంగా చంపేశారు. అయితే ఆమె మతగ్రంథం తగలబెట్టిందనేది నిజం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అఫ్గాన్‌లో మహిళలపై దారుణ అకృత్యాలు జరుగుతున్నాయని.. వారిని మనుషుల్లాగే భావించడం లేదని మహిళా సంఘాలు, మానవహక్కుల సంఘాలు తీవ్ర నిరసనలు చేపడుతున్నాయి. ఫర్కుందా మరణానికి కారకులైన నలుగురు వ్యక్తులకు కోర్టు మరణ శిక్ష విధించింది. మరికొందరికి జైలు శిక్ష పడగా.. తాజాగా మహిళను కాపాడకుండా ఉండిపోయిన పదకొండు మంది పోలీసులకు సంవత్సరం జైలు శిక్షను విధించారు.