తెదేపాలో పదవుల పందేరం

Posted On:20-05-2015
No.Of Views:288

తెదేపాలో పదవుల పందేరం జరిగింది. ఒకేసారి దాదాపు 15మందికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటాలో పార్టీకి దక్కనున్న రెండు, గవర్నర్ కోటాలో దక్కనున్న నాలుగు, స్థానిక సంస్థల కోటాలో దక్కనున్న వాటిలో తొమ్మిది స్థానాలపైనా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించలేని నలుగురు నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్‌లుగా అవకాశమివ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటా కింద ఎంపికచేసిన వారి పేర్లను ప్రకటించేశారు. గవర్నర్ కోటా కింద ఎంపికైన వారి పేర్లను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాక అధికారికంగా ప్రకటిస్తారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల స్థానాలపైనా అధికారికంగా ప్రకటించకున్నా నిర్ణయం జరిగిపోయింది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై బుధవారం తెదేపా కార్యాలయంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ఉదయం తన నివాసంలోనే కొంత కసరత్తు చేసుకున్న తర్వాత అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారు నిరీక్షిస్తున్నారు. చంద్రబాబు వారందరూ విడివిడిగా తనను కలిసేందుకు సమయం ఇచ్చారు. ఎవరికి వారు తాము పార్టీకోసం చేసిన పని, సేవలను చెప్పుకున్నారు. అనంతరం సాయంత్రం ఆరుగంటలు దాటాక పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యులు కేఈకృష్ణమూర్తి, తోట నరసింహం, అయ్యన్నపాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీనేతలకు పదవుల పంపకంపై నిర్ణయం తీసుకున్నారు.
శాసనసభ్యుల కోటాలో... షరీఫ్: పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమాల కమిటీ ఛైర్మన్‌గా గతంలో చాలాకాలం పనిచేశారు. మైనార్టీ కోటాలో అవకాశం దక్కింది. 
జూపూడి ప్రభాకర్: వైకాపా నుంచి తెదేపాలో చేరారు. ఎస్సీ సామాజికవర్గంలో బలంగా గొంతు వినిపించడం, ప్రతిపక్ష పార్టీని ఇబ్బందిపెట్టడం లక్ష్యాలుగా అవకాశమిచ్చారు. పాలడుగు వెంకట్రావు మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇచ్చారు. వెంకట్రావు నాలుగేళ్లు చేయగా...మిగిలిన రెండేళ్లు ఈయన పదవీకాలం ఉంటుంది.
గవర్నర్ కోటాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: పార్టీ పదేళ్లపాటు వరుసగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా గొంతు వినిపించారు. పార్టీలో సీనియర్ నేత. మంత్రిగా పనిచేసిన అనుభవం, ప్రస్తుతం పార్టీకి ఉన్న అవసరాల దృష్ట్యా అవకాశమిచ్చారు. టీడీ జనార్దన్‌రావు: గత పదేళ్ల నుంచి పార్టీ కార్యాలయ కార్యదర్శిగా రాత్రిపగలు కష్టించి పనిచేశారు. 
పంచుమర్తి అనురాధ: బీసీ అభ్యర్థి. గతంలో విజయవాడ నగర మేయర్‌గా పనిచేశారు. పార్టీ విధానాలను బలంగా వినిపిస్తారు. 
గౌనివారి శ్రీనివాసులు: ఈయనది చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండలం. చిత్తూరు జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి అధ్యక్షుడిగా పనిచేశారు. అధినేతకు, పార్టీకి కావాల్సిన వ్యక్తి. బీసీ కోటాలో ఇచ్చారు.
స్థానిక సంస్థల కోటాలో గాలి ముద్దుకృష్ణమనాయుడు: సీనియర్ నేత. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలోను, బయట అధికార పక్షానికి వ్యతిరేకంగా బలంగా గళమెత్తారు. 
పయ్యావుల కేశవ్: పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు శాసనసభలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చేసిన కష్టం, పార్టీ విధేయతలు పరిగణలోకి తీసుకున్నారు. 
రెడ్డి సుబ్రహ్మణ్యం: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈయన బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 
పప్పల చలపతిరావు: అనకాపల్లి ఎంపీగా, తితిదే ఛైర్మన్‌గా పనిచేశారు. వివాద రహితుడు.పార్టీకి విధేయుడు. 
శిల్పా చక్రపాణిరెడ్డి: కర్నూలు జిల్లాకు చెందిన ఈయన గత ఎన్నికలకంటే ముందు తెదేపాలో చేరారు. రాయలసీమలో బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. 
మాగుంట శ్రీనివాసులరెడ్డి: గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. బలమైన సామాజికవర్గాన్ని పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నం. 
వీరుకాకుండా స్థానిక సంస్థల కోటాలో కృష్ణా జిల్లా నుంచి వైవీబీ రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడి పేర్లపైనా చర్చ జరిగింది. గుంటూరు జిల్లా నుంచి స్థానిక కోటాలో ఎవరిని నిలపాలన్న దానిపై మాత్రం చర్చ జరగలేదు. మరోవైపు విజయనగరం జిల్లాలో నారాయణస్వామికి చెందిన నియోజకవర్గంలో సత్యం అనే ఒక ఎంపీటీసీ పార్టీ ఆవిర్భావం నుంచీ విధేయుడిగా ఉన్నారని, అతనికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది.
బీద, లింగారెడ్డి, వర్ల, పుష్పరాజ్‌లకు కార్పొరేషన్లు: ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కని నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్లు ఇవ్వాలని పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయించినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్, మాజీఎమ్మెల్యే లింగారెడ్డి, వర్లరామయ్య, మాజీ మంత్రి పుష్పరాజ్‌లకు ఈ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.