కొత్త గృహనిర్మాణ విధానం

Posted On:26-05-2015
No.Of Views:309

 హైదరాబాద్: . రాష్ట్రవ్యాప్తంగా గుత్తేదార్లకు ఇళ్ల నిర్మాణ పనులను అప్పగించ కొత్త గృహనిర్మాణ విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇకపై నేరుగా ప్రైవేటు సంస్థలే ఈ పనులను చేపడతాయి. గృహనిర్మాణ సంస్థ అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు. హైదరాబాద్, వరంగల్ నగర పాలక సంస్థల్లో రెండు లక్షల జి ప్లస్‌టూ ఇళ్ల నిర్మాణాలను చేపడతారు. ఇతర పట్టణాల్లో జీప్లస్ వన్, గ్రామాల్లో స్వతంత్ర ఇళ్లను నిర్మిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 500 గృహాలను నిర్మించాలని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్లకు భూముల ఎంపిక, సేకరణ తదితర కీలక బాధ్యతలను అప్పగిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గృహ నిర్మాణ విధానం గురించే చర్చించారు. ఇళ్ల నిర్మాణాలను నిర్లక్ష్యం చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయని, వాటికి దీటైన సమాధానం చెప్పేందుకే కొత్త విధానం తెచ్చామని, నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను నిర్మిస్తామని వారు చెప్పారు. పారదర్శకంగా వాటి నిర్మాణం చేపడతామని, అవినీతికి ఆస్కారమే లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను వచ్చేనెల రెండో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు మంత్రిమండలి అనుమతించింది. ఎలాంటి వివాదాలు లేని వాటిని మాత్రమే పంపిణీ చేయాలని సీఎం సూచించారు. కొత్త సౌరవిద్యుత్ విధానానికీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. యాదగిరిగుట్ట ప్రాధికార సంస్థకు భూముల బదలాయింపులకు అనుమతించింది. రాష్ట్రంలో అదనపు విద్యుదుత్పత్తికి బీహెచ్ఈఎల్‌తో ఒప్పందాలకు అంగీకరించింది. భూఆక్రమణల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. మెదక్ జిల్లా ములుగులోని ఉద్యానవన విశ్వవిద్యాలయానికి అటవీ భూములను బదలాయించేందుకు అనుమతించింది. ఆర్థికశాఖలో 13 కొత్త పోస్టుల సృష్టికి ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు గుత్తేదార్లతో ప్రభుత్వ పథకాల ఇళ్ల నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అమలవుతున్న ఈ పద్ధతిని రాష్ట్రమంతటా విస్తరించేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి, మంత్రిమండలి ఆమోదం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం ప్రైవేటు సంస్థల ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ద్వారా టెండర్లు పిలిచి, ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణ బాధ్యతలను వాటికి అప్పగిస్తున్నారు. దానిని గృహ నిర్మాణ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లో గత పదేళ్లలో లక్షకుపైగా ఇళ్లు కట్టారు. నాలుగేళ్ల క్రితం నిర్మించిన ఒక్కో ఇంటికి రూ.8.50 లక్షల చొప్పున చెల్లించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో ఈ తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఐడీహెచ్ కాలనీ మాదిరిగానే అన్ని చోట్ల గృహ నిర్మాణం చేపట్టాలని సీఎం భావించారు. ప్రభుత్వపరంగా ఈ తరహా నిర్మాణం జరగడానికి విధిగా ప్రత్యేక విధానం అవసరం. అందుకే కొత్త విధానాన్ని రూపొందించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణీత వ్యయ మంజూరుతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. లబ్ధిదారులు మిగతా మొత్తాన్ని భరిస్తున్నారు. కొత్తవిధానంలో లబ్ధిదారులకు వాటా ఉండదు. ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఈ తరహా ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపం, బిల్లుల మంజూరులో జాప్యం వంటి సమస్యలున్నాయి. ఇలాంటి సమస్యల వల్ల హైదరాబాద్‌లో 25 వేల ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి.