అద్దెకారు మీరే నడుపుకోవచ్చు.. గంటకు రూ.80 చార్జి

Posted On:26-05-2015
No.Of Views:288

 సొంత డ్రైవింగ్‌కు కార్లను అద్దెకిచ్చే జూమ్‌కార్‌ డాట్‌కామ్‌ సంస్థ హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. తమ వద్ద కార్‌ బుకింగ్‌ చేసుకోవడం చాలా సులభమని, తమ వెబ్‌సైట్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ అప్‌లోడ్‌ చేసి కారును అద్దెకు తీసుకోచ్చని కంపెనీ సిఇఒ గ్రెగ్‌ మోరాన్‌ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫోర్డ్‌ ఫిగో నుంచి మహీంద్రా ఎక్స్‌యువి వరకు 30 కార్లు అద్దెకు సిద్ధంగా ఉన్నాయ ని, ఏడాది కాలంలో వీటి సంఖ్యను వెయ్యికి పెంచాలని భావిస్తున్నామని చెప్పారు. ఏడాది అనంతరం ఎపి రాజధానిలో సేవలను ప్రారంభించే అంశంపై దృష్టి పెడతామన్నారు. ప్రస్తుతం దేశంలో హైదరాబాద్‌ సహా 6 నగరాల్లో సేవలనందిస్తున్నామని, ఈ నగరాలన్నింటిలో 1,200 కార్లను అద్దెకు ఇస్తున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో కోల్‌కతా సహా మొత్తం పది నగరాలకు విస్తరించాలని, మొత్తం కార్ల సంఖ్యను 4000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 75 శాతం కార్లను సొంతంగా కొనుగోలు చేస్తామని, మిగిలిన వాటిని పెద్ద కంపెనీల నుంచి లీజుకు తీసుకుంటామని తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో 1.1 కోట్ల డాలర్ల నిధులను సమీకరించామని చెప్పారు. గత నాలుగు నెలల్లో తమ రెవెన్యూ మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. దేశంలో ప్రధానంగా డ్రైవర్ల కొరత పెరుగుతోందని, ఇదే సమయంలో కార్ల ఖరీదులు తగ్గుతున్నాయని, దీంతో సెల్ఫ్‌డ్రైవింగ్‌తో కార్లను అద్దెకు తీసుకునే పద్దతికి ఆదరణ పెరుగుతోందని తెలిపారు.తమ వద్ద అద్దెను గంటలవారీగా లెక్కిస్తామన్నారు. కారును బట్టి గంటకు 80 రూపాయల నుంచి 140 రూపాయల వరకు చార్జి చేస్తామని, కనీసం 4 గంటలకు అద్దె వసూలు చేస్తామని తెలిపారు. బేసిక్‌ అద్దె కింద గంటకు పది కిలోమీటర్లు తిరగవచ్చని, ఇందులో ఇంధనం, బీమా చార్జీలు కలిపే ఉంటాయని చెప్పారు. అదనంగా తిరిగే కిలోమీటర్‌కు 12-14 రూపాయల వరకు చార్జి చేస్తామని తెలిపారు. తమ వెబ్‌సైట్లో టారిఫ్‌ కాలిక్యులేటర్‌తో ట్రిప్‌ను నిర్ణయించుకోవచ్చని చెప్పారు. కావాలనుకుంటే కస్టమర్లు రోజులు, వారాలు, నెలల చొప్పున అద్దెకు తీసుకోవచ్చని, ఒక్కోదానికి ఒక్కోటారిఫ్‌ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ పార్క్‌, మాదాపూర్‌, ఎల్‌విప్రసాద్‌ ఐ హాస్పటల్‌, రోడ్‌నంబర్‌ 12 ప్రాంతాల్లో పికప్‌ స్టేషన్లు ఏర్పాటు చేసామని చెప్పారు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా తొలి సర్వీసుపై 30 శాతం డిస్కౌంట్‌ ఇస్తామన్నారు. త్వరలో నానో నుంచి బెంజ్‌ వరకు అన్ని రకాల కార్లను హైదరాబాద్‌లో అద్దెకు ఉంచుతామన్నారు.