బాహుబలి ఆడియో ఎందుకు ఆగింది?

Posted On:29-05-2015
No.Of Views:299

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి’ తెలుగు ఆడియో, ట్రైలర్‌ల విడుదల వాయిదా పడింది. మే 31 హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వేలాది అభిమానుల మధ్య జరుపుదామనుకున్న వేడుక చివరకు అదే అభిమానుల సంఖ్య కారణంగా ఆగడం విచిత్రం. దాదాపు 35 వేల మంది ఫ్యాన్స్ ఫంక్షన్‌కు హాజరవుతారని అంచనా వేశారు. చిత్ర యూనిట్ అందుకు ఏర్పాట్లు చేస్తున్నా, గతంలో ‘గోపాల... గోపాల’, ‘బాషా’, ‘మిర్చి’ ఆడియో ఫంక్షన్లలో లాగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు చెప్పారు.పరిమిత సంఖ్యలో జనమైతే అనుమతి ఇస్తామన్నారు. బుధవారం సాయంత్రం ఈ విషయం తెలిసిందనీ, దాంతో కొందరినే అనుమతించి, వేలాది ఫ్యాన్‌‌సను నిరాశపరచడం ఇష్టం లేక ఆఖరి క్షణంలో తెలుగు ఆడియో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామనీ ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి తెలిపారు. పరిస్థితి అర్థం చేసుకొని, ఫ్యాన్‌‌స తమను క్షమించాలంటూ రాజమౌళి, హీరో ప్రభాస్, నిర్మాతల్లో ఒకరైన శోభూ యార్లగడ్డ అభ్యర్థించారు.‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి తొలిసారిగా పెట్టిన విలేకరుల సమావేశంలో గురువారం ఉదయం వారు ఈ విషయం ప్రకటించారు. ‘‘ఇప్పటి దాకా సినిమా రిలీజ్ డేట్లే వాయిదా వేయాల్సి వచ్చింది. దానిలాగే ఇప్పుడు ఆడియో రిలీజ్ కూడా అనుకోకుండా పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది’’ అని రాజమౌళి కొంత బాధగా అన్నారు. ‘మిర్చి’ ఆడియో తరువాత దాదాపు రెండున్నరేళ్ళుగా అభిమానుల ముందుకు రాని ప్రభాస్ సైతం ‘‘ఆడియో, సినిమా రిలీజ్‌లతో జనానికి దగ్గర కావాలని మేము కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం’’ అన్నారు. తెలుగు ఆడియో విడుదల ఎప్పుడు, ఎలా చేయాలి, ఫ్యాన్స్ రావడానికి ఇబ్బంది అయితే ఫ్యాన్స్  దగ్గరకే ప్రభాస్ వెళ్ళేలా వేర్వేరు ఊళ్ళలో చేయాలా అన్నది ప్లాన్ చేస్తున్నామని రాజమౌళి వివరించారు.
 హిందీ ఆగదు...ఇది ఇలా ఉండగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రైలర్‌ను మాత్రం ముందుగా ప్లాన్ చేసినట్లే, జూన్ 1న ముంబయ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ ఆడియోను చెన్నైలో ప్రత్యేకంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ‘‘బాహుబలి ఫస్ట్‌పార్ట్ రీరికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ దాదాపు అయిపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనే జరుగుతోంది. తుది నిడివి 2.30  నుంచి 2.35 గంటల మధ్య ఉంటుంది. రెండో పార్ట్ షూటింగ్ 70 శాతం అయిపోయింది’’ అని రాజమౌళి వివరించారు.