ఒత్తిడి చేయం, బీఫ్ నిషేధంపై నిర్ణయం ఆయా రాష్ట్రాలదే: అమిత్ షా

Posted On:29-05-2015
No.Of Views:255

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బీఫ్‌ నిషేధంపై నిషేధం విధించనున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధ్యక్షడు అమిత్ షా స్పందించారు. తాము అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని, దేశవ్యాప్తంగా బీఫ్‌పై నిషేధం ఏమీ విధించలేదని షా స్పష్టంచేశారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ బీఫ్ నిషేధం విధించాలంటూ ప్రభుత్వాలపై తాము ఒత్తిడి చేయమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుదని, వారి ఆలోచనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. ఇది ఇలా ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానాలు బీఫ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 'బీఫ్ తినాలనుకునేవారంతా పాకిస్ధాన్‌కు వెళ్లిపోవచ్చు' అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అమిత్ షా తెలిపారు. ఇక యూపీఏ హయాంలో సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారించారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను షా సమర్ధించారు. యూపీఏ హయాంలో మంత్రివర్గం, అధికారులు, ప్రజలు ఇలా ఎవరికీ ప్రధానిపై విశ్వాసం ఉండేది కాదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామిని నిలబెట్టుకున్నామని అన్నారు.