తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు

Posted On:29-05-2015
No.Of Views:230

 హైదరాబాద్: తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరి పేరునే ప్రతిపాదిస్తూ 30సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి పార్టీ రాజ్యాంగం ప్రకారం.. క్రియాశీల సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా నామినేషన్ వేయవచ్చు. ఒకరు ప్రతిపాదిస్తే మరొకరు బలపరచాల్సి ఉంటుంది. చంద్రబాబును ప్రతిపాదిస్తూ అశోక్‌గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, నందమూరి బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాథోడ్ రమేష్ తదితరులు వేర్వేరు సెట్ల నామినేషన్లు దాఖలుచేశారు. వాటిని బలపరుస్తూ పలువురు నేతలు సంతకాలు చేశారు. మొత్తంగా కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరి పేరుపైనే నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఏకగీవ్రంగా ఎన్నికఉంటుంది.

95శాతం వస్తేనే ఉత్తీర్ణత: మహానాడు నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ శ్రేణుల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇందులో 95 శాతం చాలా బాగుందనే అభిప్రాయం వ్యక్తమైతేనే ఉత్తీర్ణత సాధించినట్లు భావించాలని చంద్రబాబు ప్రకటించారు. తొలిరోజు మహానాడు నిర్వహణ ఏర్పాట్లపై అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వ పరిశీలనకు సంబంధించి తీసుకువచ్చిన విధానం బాగుందని 80.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. 15 శాతం ఫర్వాలేదన్నారు. మిగిలిన వాళ్లు బాగా లేదని తేల్చారు. సదుపాయాలు 76.7 శాతం మందికి నచ్చాయి. 16.2శాతం మంది ఫర్వాలేదన్నారు. మిగిలిన వాళ్లకు నచ్చలేదు. మంచినీళ్లను అందించిన విధానం 85శాతం మంది బాగుందని చెప్పగా మూడు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన వాళ్లు ఫర్వాలేదన్నారు. మహానాడు నిర్వహించే మూడు రోజులూ ఇదే విధంగా అభిప్రాయాలు తీసుకుంటారు.
పేదరికంపై పోరాడతాం..: పేదరిక నిర్మూలనను తెదేపా ఉద్యమంలా చేపడుతుందని పార్టీ అధినేత చంద్రబాబుచెప్పారు. 'బడుగుల సంక్షేమం- సమగ్రాభివృద్ధి- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, మహిళా సాధికారత- గృహనిర్మాణం- తెదేపా విధానం'అంశంపై మహానాడులో మంత్రి రావెల కిషోర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏడాదిలోగా ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చింది తెదేపానే అన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని మహానాడు వేదికగా డిమాండ్ చేస్తున్నామన్నారు.