అసెంబ్లీని రద్దు చేస్తా

Posted On:29-05-2015
No.Of Views:241

హైదరాబాద్:  ‘ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో తేడా వస్తే సహించేది లేదు.ఎవరైనా తప్పు చేస్తే అసెంబ్లీని రద్దు చేస్తా. మధ్యంతర ఎన్నికలకు పోయి మళ్లీ టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటా’ అని అధికార ఎమ్మెల్యేలు, మంత్రులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. పార్టీ నిర్దేశించిన ప్రకారం ఓట్లు వేస్తే పోటీ చేస్తున్న ఐదు సీట్లను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తేడా వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. గెలుస్తామనే పూర్తి విశ్వాసంతోనే ఐదో సీటుకు అభ్యర్థిని నిలబెట్టామని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే సునాయాసంగా విజయం సాధిస్తామన్నారు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ సీట్లకు జూన్ 1న జరగనున్న ఎన్నికలు, అదే రోజుతో ముగుస్తున్న ఏడాది పాలనపై కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. దాదాపు ఎమ్మెల్యేలంతా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.‘కొత్త రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం. ఆసరా పింఛన్లు, సన్న బియ్యం, దళితులకు భూ పంపిణీ వంటి పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చివరికి చేరేది మన గూటికే. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం పార్టీ మాత్రమే మిగులుతాయి. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుని పార్టీ నిర్దేశం ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో   మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాలి. దీనిపై శని, ఆదివారాల్లో తెలంగాణ భవన్‌లో మాక్ ఓటింగ్ ద్వారా అవగాహన కల్పిస్తాం’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఓట్లకు సంబంధించి జిల్లా మంత్రులదే  మొదటి బాధ్యత అని, ముందుగా వారి పదవులు పోతాయని కూడా కేసీఆర్ హెచ్చరించినట్లు సమాచారం. టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏడాది ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి వివరించినట్లు ఈ సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మీడియాకు చెప్పారు. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టడం, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని సీఎం సూచించినట్లు తెలిపారు.