ఆర్తి అగర్వాల్ కన్నుమూత

Posted On:06-06-2015
No.Of Views:284

 ప్రముఖ సినీనటి ఆర్తి అగర్వాల్ (31) మరణించారు. అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో ఆమె మరణించారు. గుండెపోటుతో ఆర్తి మరణించినట్లు ఆమె మేనేజర్ చెప్పారు. స్థూలకాయంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కారణంగానే ఆమె మరణించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అట్లాంటిక్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకోడానికి ఆమె అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ఆపరేషన్ విఫలం కావడం వల్లే ఆమె మరణించినట్లు కూడా అనధికార కథనాలు వినవస్తున్నాయి.
2001లో ఆర్తి అగర్వాల్ సినీరంగ ప్రవేశం చేసింది. పాగల్పన్ సినిమాతో బాలీవుడ్లో ప్రవేశించినా.. తర్వాత అదే సంవత్సరంలో వెంకటేశ్ సరసన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో తెలుగులో భారీ హిట్తో వచ్చింది. తర్వాత ఇంద్ర, నీ స్నేహం, నువ్వులేక నేను లేను, వసంతం, బాబీ, అడవిరాముడు (జూనియర్ ఎన్టీఆర్) లాంటి సినిమాల్లో ఆమె నటించారు. ఆర్తి చిట్టచివరిగా నటించిన సినిమా నీలవేణి.
ఉజ్వల్ కుమార్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకున్న ఆర్తి అగర్వాల్.. ఆ తర్వాత కూడా నటించింది. సునీల్ సరసన అందాల రాముడు లాంటి సినిమాల్లో కూడా ఆమె నటించింది. కాగా, గతంలో ఒకసారి ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అప్పట్లో ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించారని కథనాలు వచ్చాయి.
ఆర్తి అగర్వాల్ తెలుగులో 20 సినిమాల్లో నటించారు. నీలవేణి సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. దాని దర్శకుడు భరత్ పారేపల్లి. తెలుగులో దాదాపుగా ప్రముఖ హీరోలు అందరితోను ఆమె నటించింది.