యోగా ద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మోదీ

Posted On:20-06-2015
No.Of Views:267

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యోగా ద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మానవ వికాసానికి యోగా ఎంతో ఉత్కష్టమైనదన్నారు. సమస్యలు లేని జీవనానికి యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. యోగా అంటే సర్కస్ కాదు.. మానవ అంతః సౌందర్య ఉత్ప్రేరకమని మోదీ అన్నారు. శాంతి సద్భావన కోసమే అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశ్వ వ్యాప్తంగా జరుగుతున్న యోగా భ్యాసం... మానవాళికి భారత్ ఇస్తున్న కానక అని వివరించారు. రాజ్‌పథ్... యోగాపథ్ అయిందని ఈసందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. యోగా గురువు రాందేవ్‌బాబా తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40వేల మంది ఔత్సాహికులతో కలిసి ప్రధాని మోదీ కూడా యోగాసనాలు వేశారు.

యోగాను జీవితంలో అలవాటుగా చేసుకోవాలి: గవర్నర్
: ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో ఒక ముఖ్యమైన అలవాటుగా చేసుకోవాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ ఉదయం రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు జీవన విధానంలో సమతుల్యత పాటించేందుకు యోగా ముఖ్య సాధనంగా ఉపయోగ పడుతుందన్నారు. తాను కూడా ఇటీవల యోగా సాధనను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులతో పాటు రాజ్‌భవన్ ఉద్యోగులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

యోగా మనందరి జీవనశైలిలో భాగం: ఏపీ సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... యోగా మనందరి జీవనశైలిలో భాగమన్నారు. పూర్వికులు మనకు ఇచ్చిన వారసత్వ సంపద యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి వల్లే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. మనుషులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చాలా ముఖ్యమన్నారు. రాష్ట్రమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, నారాయణ, కృష్ణా జడ్పీ ఛైర్మన్ గద్దె అనూరాధ, ఉన్నతాధికారులు, ఔత్సాహికులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రాష్ట్రమంత్రులు యోగాసనాలు వేశారు.