టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఏపీ సిట్ నోటీసులు

Posted On:20-06-2015
No.Of Views:267

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పలువురు ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏపీ సిట్ అధికారులు శనివారం ఉదయం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లన్నింటికీ నోటీసులు జారీ చేశారు. ఏపీకి చెందిన 120 మంది ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురుయ్యాయని, మరో 27 నెంబర్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు తమకు అనుమానం ఉందని వీటికి సంబంధించిన వివరాలను అందజేయాలని ఆ నోటీసుల్లో కోరినట్లు తెలిసింది. లిఖితపూర్వకంగా అనుమతి లేఖలు రాసి దీనికి పాల్పడ్డారా? లేదా ట్యాపింగ్‌కు పాల్పడిన తర్వాత అనుమతులు పొందారా? తదితర విషయాలకు సంబంధించిన పూర్తి దస్త్రాలు, ఆధారాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నెల 22వ తేదీ (సోమవారం) ఉదయం 11 గంటల కల్లా విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌లో వివరాలను అందజేయాలని అందులో ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు కేసీఆర్, ఇతరులపై ఏపీలోని 13 జిల్లాల పరిధిలో నమోదైన కేసుల విచారణకు గాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏపీ డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సుదీర్ఘంగా భేటీ అయ్యింది. సిట్ అధిపతి మహ్మద్ ఇక్బాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసుల్లో ఎక్కువగా ఫోను ట్యాపింగ్‌కు సంబంధించినవే కావడంతో...ఆ దిశగా కూడా దర్యాప్తు ముమ్మరం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిననాయకుల ఫోన్లను ట్యాపింగ్‌పై అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. అయితే ఈ విషయంపై రెండు, మూడు రోజులు సంయమనంతో ఉండాలని, తదుపరి ఏం చేయాలన్నదానిపై అప్పుడు నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబునాయుడితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, నిఘా విభాగం అదనపు డీజీ అనురాధ, ఏసీబీ డీజీ మాలకొండయ్యలతో శనివారం భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణలకు చెందిన తెదేపా నేతలతోను విడివిడిగా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒక ఐఏఎస్ అధికారికి సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. వీటిపై పూర్తి ఆధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరించారని, ఆయన రెచ్చగొట్టినంత మాత్రాన మనం కూడా దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పుడు మీడియాలో లీకులు ఇచ్చి..హడావుడి చేసి ఇచ్చిందని, కానీ ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు హడావుడి ఏమీ లేదని...అలాంటి పంథానే అనుసరించాలని చంద్రబాబు సూచించారని తెలిసింది.