నగరానికి వరాలజల్లు

Posted On:20-06-2015
No.Of Views:285

రాజకీయాలకతీతంగా అభివృద్ధి: నగరానికి సీఎం కేసీఆర్ వరాలు
అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
'స్వచ్ఛ హైదరాబాద్' కోసం నిధుల కేటాయింపు
విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి అంతా కలిసిరావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడివుందని స్పష్టంచేశారు. శనివారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధిసంస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమాన్ని కేసీఆర్ సమీక్షించారు. అందరం కలిసి, హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా ఆవిష్కరిద్దామన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒక్కచోటచేరి సమీక్షించుకోవడం చరిత్రాత్మక ఘట్టమని కేసీఆర్ అభివర్ణించారు.నగరాభివృద్ధికి కేసీఆర్ వరాలజల్లు కురిపించారు.అత్యాధునిక వసతులతో 200 మోడల్‌మార్కెట్ల నిర్మాణం,చి 50 ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి,చి కొద్దిరోజుల్లోనే 175 బస్సుస్టాపుల సిద్ధం. అన్నివిధాల వినియోగంలోకి వచ్చేలా 50ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం,చి 36 శ్మశానవాటికలు, 36 చెరువుల ఆధునికీకరణ/సుందరీకరణ,చి 2లక్షల ఇళ్ల నిర్మాణం, అందుబాటులోకి 18 దోబీఘాట్లు,చి నగరంలో ఆహ్లాదకర వాతావరణానికి 150 పార్కుల అభివృద్ధి.వెయ్యి క్రీడాస్థలాల అభివృద్ధి, 1000 వ్యాయామశాల(జిమ్స్)ల్లో ఆధునిక సౌకర్యాల కల్పన, పాఠకులకు వెయ్యి ఇ-లైబ్రరీల ఏర్పాటు. దశలవారీగా వీటి నిర్మాణం చేపట్టి, నగరంలో మౌలిక వసతులను కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు.నాలాల నిర్వహణపై ఉపసంఘాలు..: నగరంలో 77నాలాలతోపాటు మురుగునీటి కాల్వల నిర్వహణపై ప్రజాప్రతినిధులతో ఉపసంఘం వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాని సిఫారసులను ప్రభుత్వం యథాతథంగా స్వీకరించి చర్యలు తీసుకుంటుందన్నారు. మురుగుతో సహా మూసీలో కలిసే రకరకాల నీటిని రెండుసార్లు శుద్ధిచేస్తే మళ్లీ వాడడానికి వీలవుతుందని సీఎం అన్నారు. ప్రస్తుతం రోజూ 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేయగలుగుతున్నాం, ఆ సామర్థ్యాన్ని మరో 600మిలియన్ లీటర్ల వరకూ పెంచితే మూసీలో శుభ్రమైన నీటిప్రవాహాన్ని చూడగలమని ఆయన చెప్పారు. మంచినీటి సరఫరా, నాలాల నిర్వహణ, చెత్తసేకరణ, శిథిలాల తొలగింపు, మురుగునీటి పారుదల, చెత్తసేకరణ కేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాలు.. ఇలా ఏడు అంశాలపై ప్రత్యేక కమిటీలు నియమించుకొని, ప్రతి వారం సమీక్షించాల్సిన అవసరాన్ని సీఎం నొక్కిచెప్పారు. వీటి నిర్వహణపై ఈ కమిటీలు ప్రభుత్వానికి తగిన సూచనలుచేయాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసమూ కమిటీని వేయాలన్నారు. నగరంలోని పట్టణ ఆరోగ్యకేంద్రాల నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆదేశించారు.ప్రతిఇంటికీ నల్లానీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నల్లా కనెక్షన్ కోసం డబ్బు చెల్లించినవారికి వెంటనే నీటిని అందజేయాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచినీళ్లు అందేలా చూస్తామన్నారు. ఇందుకోసం కూడా కమిటీని నియమించాలన్నారు. కూరగాయలు, మాంసం విక్రయాలు, చేపల మార్కెట్లతోపాటు జంతువధశాలలు నగరంలో చాలాచోట్ల నిర్మించాల్సి ఉందన్నారు. ఇందుకోసం స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.