ఓటేయకుంటే 2.5 కోట్లు ఇస్తామన్నారు: స్టీఫెన్సన్ వాంగ్మూలం

Posted On:21-06-2015
No.Of Views:300

హైదరాబాద్‌: ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.2.5 కోట్లు... తమ అభ్యర్థికే ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు’... ఇది ముడుపుల కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ చెప్పిన మాట! న్యాయమూర్తి ఎదుట స్టీఫెన్‌సన్‌ ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాలు బయటపడ్డాయి. ఈ వాంగ్మూలంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించారు.
 ‘‘గతనెల 28వ తేదీ 9 గంటలకు మ్యాథ్యూస్‌ జెరుసలేం (మత్తయ్య) నాకు ఫోన్‌ చేశారు. 30వ తేదీ జరగాల్సిన ఓ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తాను బిజీగా ఉన్నందున 11 గంటల ప్రాంతంలో ఏ విషయం చెబుతానని సమాధానమిచ్చాను. 10 గంటలకు నేరుగా మత్తయ్య బోయిగూడలోని మా ఇంటికి వచ్చారు. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు నన్ను కలిసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనకుండా ఉంటే రూ.2 కోట్లు ఇస్తామని చెప్పారు. నేను దీనిపై స్పందించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. గంటన్నర తర్వాత ఆంథోని మా ఇంటికి వచ్చారు. తనతోపాటు సెబాస్టియన్‌ను తీసుకొచ్చి తన స్నేహితుడిగా పరిచయం చేయించారు. సెబాస్టియన్‌ను అక్కడ ఉంచి, ఆంథోనీ వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించేందుకు చంద్రబాబు తనను పంపించారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకపోవడం లేదా... టీడీపీ అభ్యర్థి వి.రాఘవేందర్‌ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయడమో చేయాలని కోరారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే రూ.2 కోట్లతోపాటు, కుటుంబ సమేతంగా జెరుసలేం వెళ్లేందుకు టికెట్లు కూడా ఇస్తామన్నారు. ఒకవేళ, టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ. 5 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. ఏ విషయం తర్వాత చెబుతానని నేను బదులిచ్చాను. లంచం తీసుకుని ఓటు వేయడం చట్టవిరుద్ధం, అనైతికం అని నేను భావించాను. అదే రోజు (28వ తేదీ) మధ్యాహ్నం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌కి లేఖ రాశాను. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వద్ద ఉన్న ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీకి లేఖ అందజేశాను.ఈ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ అశోక్‌ కుమార్‌ను కోరాను. అదే రోజు సాయంత్రం 6 గంటలకు మత్తయ్య నాకు ఒక ఎస్‌ఎంఎస్‌ పంపించాడు. తాజ్‌ కృష్ణా హోటల్‌లో కలిసేందుకు అనుకూలమైన సమయం చెప్పాల్సిందిగా కోరారు. గతంలో అడిగిన విషయంలో నా అభిప్రాయం ఏమిటో తెలపాల్సిందిగా కోరుతూ... 29న మరో ఎస్‌ఎంఎస్‌ పంపించాడు. వెంటనే విషయం ఫైనల్‌ చేయాల్సిందిగా కోరాడు. 29వ తేదీ వాట్సాప్‌ద్వారా నా మొబైల్‌కు సెబాస్టియన్‌ నుంచి ఒక సందేశం వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి నా నిర్ణయమేంటని అడిగారు. తమ పార్టీ కార్యాలయంలో సమావేశం ముగిసిన తర్వాత కలుస్తానని సమాధానం పంపించాను. రాత్రి 9 గంటలకు నేను సెబాస్టియన్‌కు ఫోన్‌ చేశాను. ఈ వ్యవహారానికి టీడీపీలో కీలకమైన (రెస్సాన్సిబుల్‌) నాయకుడిని మాత్రమే కలుస్తానని చెప్పాను. ఎమ్మెల్యే రేవంత్‌ ఈ వ్యవహారం నడుపుతున్నట్లు సెబాస్టియన్‌ నాకు చెప్పారు. మరుసటిరోజు (30న) ఉదయం పదింటికి రేవంత్‌ రెడ్డితో కలిసి వస్తున్నట్లు సెబాస్టియన్‌ చెప్పారు. అయుతే ఇదే విషయాన్ని డీఎస్పీకి చెప్పాను. ఆయన తన బృందంతో ఉదయమే మా ఇంటికి చేరుకొని ఆడియో, వీడియో రికార్డింగ్‌ ఉన్న ఐ ఫోన్‌ను సిట్టింగ్‌ హాల్‌లో ఉన్న టీవీ వద్ద అమర్చారు. పన్నెండు గంటల ప్రాంతంలో రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్‌ మా సోఫాసెట్లో కూర్చున్నారు. వారికి ఎదురుగా నేను మరో సోఫాలో కూర్చున్నాను. చంద్రబాబు పంపితేనే వచ్చామని రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్దమని చెప్పారు. చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేయిస్తానని, ఈ విషయం అత్యంత రహస్యంగా ఉంచుతానని రేవంత్‌ హామీ ఇచ్చారు. చంద్రబాబును కలిసేందుకు నేను నిరాకరించి, రేవంత్‌తోనే వ్యవహారం నడిపేందుకు నేను అంగీకరించాను. ఒకవేళ రెండున్నర కోట్ల రూపాయల ఆఫర్‌ సుముఖంగా లేకపోతే ఎంతకావాలో చెబితే చంద్రబాబుతో చెప్పి చూస్తానని, డబ్బుల విషయం ఆయనే వ్యక్తిగతంగా చూస్తారని చెప్పారు. ఎంత కావాలో చెప్పాల్సిందిగా రేవంత్‌ మళ్లీ అడిగారు. వారు అడిగిన మేరకు... ఓ ఐదు కోట్లు కావాలని యథాలాపంగా నేను చెప్పాను. ఇదే రోజు చంద్రబాబుతో మాట్లాడి డీల్‌ కన్‌ఫర్మ్‌ చేస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం సెబాస్టియన్‌ మూడు, నాలుగు సార్లు ఫోన్‌ చేశారు. చంద్రబాబు బిజీగా ఉన్నారని, ఆయన ఫ్రీ అవగానే ఫోన్‌ చేస్తారని చెప్పారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నా మొబైల్‌ నెంబర్‌కు సెబాస్టియన్‌నుంచి ఫోన్‌ వచ్చింది. చంద్రబాబు మాట్లాడతారని చెప్పి ఫోన్‌ ఆయనకు ఇచ్చారు. వారి మనుషులు డీల్‌ గురించి చెప్పారని... నాకు భయమేమీ అక్కర్లేదని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చునని చంద్రబాబు చెప్పారు. తద్వారా... రూ.5 కోట్లు ఇస్తామని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరుసటి రోజు(31వ తేదీ) ఉదయం 8.50కి నాకు సెబాస్టియన్‌ ఫోన్‌ చేశారు. రెండు గంటల ప్రాంతంలో రూ.50లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని రేవంత్‌ రెడ్డి, తాను వస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 3.20 నిముషాలకు ఫోన్‌ చేసిన సెబాస్టియన్‌ మా ఇంట్లో కాకుండా, మరోచోట కలుసుకుందామని చెప్పారు. అయితే సికింద్రాబాద్‌ రైల్వే డిగ్రీ కాలేజ్‌ ఎదురుగా ఉన్న నా స్నేహితుడు మాల్కం టేలర్‌ ఇంట్లో కలుసుకుందామని చెప్పాను. టేలర్‌ నాకు గత 25 సంవత్సరాలుగా స్నేహితుడు. తన తల్లి ఇంట్లో కలుసుకోవచ్చునని టేలర్‌ చెప్పారు. ఈ వివరాలను ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌కు చెప్పి మార్క్‌టేలర్‌ తల్లి ఇంటికి వెళ్లాను. నేను నా స్నేహితుడు హాల్లో కూర్చున్నాం. ఏసీబీ అధికారులు ఆడియో, వీడియో పరికరాలను అమర్చారు. ఐ ఫోన్‌ వీడియో రికార్డర్‌ను నా చేతిలో పట్టుకోవాల్సిందిగా సూచించారు. సాయంత్రం నాలుగింటికి సెబాస్టియన్‌ నాకు ఫోన్‌ చేసి, ఉప్పల్‌ వైపు నుంచి వస్తున్నామని, అడ్రస్‌ సూచించాలని కోరారు. టేలర్‌కు ఫోన్‌ ఇచ్చి, ఆయనచేతే అడ్రస్‌ చెప్పించాను. 4.20 ప్రాంతంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ ఇంటికి వచ్చి హాల్లో కూర్చున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి 5.8 అడుగులతో తెల్ల టీ షర్ట్‌, జీన్స్‌ ధరించిన ఓ వ్యక్తి నల్లని బ్యాగుతో వచ్చాడు. రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్‌ ఆదేశాల మేరకు బ్యాగు టీ పాయ్‌పై ఉంచాడు. ఆ తర్వాత రూ.500 నోట్ల కట్టలను బయటకు తీశాడు. ఒక్కో బండిల్‌లో రూ.2.5 లక్షలున్నాయి. మొత్తం 20 బండిళ్లలో రూ.50 లక్షలున్నాయి. రేవంత్‌రెడ్డి, బ్యాగ్‌ తెచ్చిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాను బిజీగా ఉన్నానని, మిగతా విషయాలు సెబాస్టియన్‌ మాట్లాడుతారని చెప్పి పైకి లేచారు. అంతలోనే, రేవంత్‌రెడ్డి, అతనితో పాటు వచ్చిన వ్యక్తిని ఏసీబీ అధికారులు తిరిగి లోపలికి పట్టుకొచ్చారు. నేను వెంటనే ఆ గది నుంచి బయటికివచ్చాను. కానీ, ఆ పరిసరాల్లోనే ఉన్నాను. మరో మూడు గంటల తర్వాత డీఎస్పీ అశోక్‌కుమార్‌ నాకు ఫోన్‌చేసి రేవంత్‌రెడ్డి తనతో ఉన్నారని, డబ్బులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసేందుకు లంచంగానే రూ.50 లక్షలు ఇచ్చారని నేను డీఎస్పీకి చెప్పాను. ఆ తర్వాత ఏసీబీ అధికారులు నన్ను, నా స్నేహితుడు మాల్కం టేలర్‌, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, డబ్బుల బ్యాగు తెచ్చిన వ్యక్తిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఏసీబీ అధికారులు పూర్తిగా విచారించి నా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు ఆడియో, వీడియోలో రికార్డు చేశారు.న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు తప్పుగా చెప్పారు. టీడీపీ తరఫున వేం నరేందర్‌ రెడ్డి పోటీ చేయగా... వాంగ్మూలంలో మాత్రం ‘వి.రాఘవేందర్‌ రెడ్డి’ అని నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం స్టీఫెన్‌సన్‌ సమావేశమయ్యారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఆయన కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కేసీఆర్‌ను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, వాంగ్మూలం ఇవ్వటానికి ముందుకేసీఆర్‌ను మెదక్‌ జిల్లాలోని ఆయన ఫామ్‌హౌస్‌లో కలిసినట్లు తెలుస్తోంది.