అఫ్ఘాన్‌ పార్లమెంటుపై ఉగ్ర దాడి

Posted On:23-06-2015
No.Of Views:286

కాబూల్‌:. అఫ్ఘానిస్థాన్‌ పార్లమెంటు సమావేశం జరుగుతోంది.. నూతన రక్షణ మంత్రి మహ్మద్‌ మసూమ్‌ని ఎంపీలకు పరిచయం చేసే కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. ఇంతలో పార్లమెంటు ప్రాంగణం బాంబుల మోతతో దద్దరిల్లింది.. భీతావహులైన ఎంపీలు, సిబ్బంది, విలేకరులు పార్లమెంటు ప్రాంగణం నుంచి పరుగులుదీశారు.. అప్రమత్తమైన భద్రతాదళాలు రంగంలోకి దిగాయి.. ఎంపీలకు రక్షణ కల్పిస్తూ ఉగ్రమూకలపై ఎదురుదాడి చేశాయి..ఈ మొత్తం దృశ్యాలు అఫ్ఘానిస్థాన్‌ అధికారిక టీవీ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమయ్యాయి
.అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. పార్లమెంటుపై దాడే లక్ష్యంగా తాలిబన్‌ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. భద్రతాదళాల దృష్టిని మరల్చేందుకు తొలుత పార్లమెంటు భవనానికి కూతవేటు దూరంలో నిలిపి ఉంచిన కారులో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ పేలుడులో చిన్నారి సహా ఇద్దరు మృతిచెందారు. 31 మంది పౌరులు గాయపడ్డారు. అదే సమయంలో ఆరుగురు ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడ్డారు. రాకెట్‌లాంచర్లతో గ్రెనేడ్లు ప్రయోగిస్తూ.. బాంబులు విసురుతూ..తుపాకులతో కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టించారు. బాంబుల దాడితో భీతిల్లిన ఎంపీలు, విలేకరులు పార్లమెంటు హాలు నుంచి పరుగులు తీశారు. నూతన రక్షణ మంత్రి మహ్మద్‌ మసూమ్‌ని కొద్దిసేపట్లో పార్లమెంటుకు పరిచయం చేస్తారనగా ఈ దాడి జరిగింది. అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుదాడికి దిగాయి. ఎంపీలే లక్ష్యంగా పార్లమెంటు హాలులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను నిలువరించాయి. సుమారు రెండుగంటలపాటు ఇరుపక్షాల నడుమ హోరాహోరీ కాల్పులు కొనసాగాయి. ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో ఎంపీలు ఎవ్వరూ గాయపడలేదు. పార్లమెంటు భవనం స్వల్పంగా ధ్వంసమైంది. నాటో దళాల సాయం లేకుండా అఫ్ఘాన్‌ భద్రతాదళాలు పెద్దఎత్తున ఉగ్రవాదులను ఎదుర్కొనడం ఇదే తొలిసారి. 2012లోనూ తాలిబన్లు పార్లమెంటుపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. పార్లమెంటుపై దాడికి తామే కారణమని తాలిబన్లు ప్రకటించారు. అఫ్ఘానిస్థాన్‌ పార్లమెంటుపై తాలిబన్ల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వాధికారులు, విదేశీయులే లక్ష్యంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తాలిబన్లు దాడులకు పాల్పడుతున్నారు. రంజాన్‌ మాసంలో కాల్పుల విరమణ పాటించాలన్న మతపెద్దల మాటలను బేఖాతర్‌ చేస్తూ దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దస్త్‌-ఎ.ఆర్చీ జిల్లాను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులు తాజాగా కుందుజ్‌ జిల్లానూ ఆక్రమించారు.