సండ్ర వచ్చేనా?

Posted On:28-06-2015
No.Of Views:253

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఈ వారం ఎంతో కీలకం కానుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య(టీడీపీ) ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాల్సిన గడువు సోమవారంతో ముగియనుంది. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆయన సోమవారం వస్తారా.? లేక మరింత గడువు కోరతారా? అన్నది తెలియడం లేదు. స్టీఫెన్‌సన్ కేసులో సండ్రకు ఎలాంటి సంబంధం లేకున్నా అనుమానంతో ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీంతో అనారోగ్య కారణాల రీత్యా తాను రాలేక పోతున్నానని, అత్యవసరమైతే ఆస్పత్రికి రావచ్చని ఏసీబీకి ఆయన లేఖ పంపారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు సండ్ర వెంకట వీరయ్యకు కొంత గడువు ఇచ్చారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన గడువు సోమవారంతో పూర్తి అవుతోంది. సండ్రపై తీసుకోనున్న తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు ఇంత వరకు నోరు మెదపులేదు. ఇది ఇలా ఉంటే సోమవారంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రిమాండ్ ముగియనుంది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాడు తీర్పు వెలువడనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ స్క్వాష్ పిటిషన్‌పై సోమవారం విచారణకు రానుంది. రేవంత్‌కు బెయిల్‌ రాకుండా అడ్డుకోవాలని ఏసీబీ అధికారులు గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.