ఒక్క ఫోన్ కొట్టు... పోరాటానికి సిద్ధం

Posted On:29-06-2015
No.Of Views:281

చెన్నై;ఒక్క ఫోన్ కొట్టండి చాలు... వీధి పోరాటాలకు రెడీ; అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్భు పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలి ఎంపిక కసరత్తుల్లో ఆ విభా`గం జాతీయ కమిటీ నిమగ్నమైంది. దీనిపై జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా రంగంలోకి దిగారు.రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు గట్టి పోటీ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. పలువురు సీనియర్ నారీమణులు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఆ పదవికి ప్రజాకర్షణ కల్గిన మహిళను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఏఐసీసీ ఉంది. ఇందుకు అన్ని రకాల అర్హతలు పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి కుష్బుకు మాత్రమే ఉన్నదన్న విషయాన్ని ఏఐసీసీ గ్రహించింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పోటీని సామరస్య పూర్వకంగా పరిష్కరించడంతోపాటుగా పార్టీ వర్గాల అభిప్రాయాల్ని సేకరించేందుకు ఆ విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా రంగంలోకి దిగారు. సోమవారం చెన్నైలో పార్టీ వర్గాలతో, మహిళా నాయకులతో ఆమె భేటీ నిర్వహించారు. మహిళా విభాగం బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటుగా, పార్టీ వర్గాల అభిప్రాయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ సమావేశంలో భాగంగా జరిగిన&ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ పుట్టినరోజు వేడుకలో కుష్బు ప్రసంగం ప్రతి ఒక్కర్ని ఆకట్టుకోవడం గమనార్హం.
ఒక్క ఫోన్ కొట్టు: సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శోభా ఓజాను మహిళా నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ గతంలో పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పగ్గాలు చేపట్టానని, ఇప్పుడు అదే పని చేస్తున్నానని గుర్తు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ కాంగ్రెస్ బలాన్ని చాటుదామని పిలుపు నిచ్చారు. ఇందుకు మహిళా విభాగం బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అనంతరం కుష్బు మాట్లాడుతూ పార్టీ బలోపేతం, పూర్వ వైభవం లక్ష్యంగా ప్రతి ఒక్కరం సమష్టిగా శ్రమిద్దామని పిలుపు నిచ్చారు.పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న తనను ప్రతి చోటకు ఆహ్వానించే అవకాశం, అధికారిక కార్యకర్తలకు ఉందన్నారు. మీ ఇంటి పక్కనున్న ఏదేని సమస్యకానీయండి, నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యలు కానీయండి, ప్రధానంగా ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా కలుసుకుని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కొట్టండి చాలు... వీధి పోరాటాలకు రెడీ... ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ప్రజల కోసం శ్రమించేందుకు, ఉద్యమించేందుకు సిద్ధంఅంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సమావేశ మందిరంలో కరతాళ ధ్వనుల్ని మార్మోగించాయి. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే డి.యశోద, రాణి వెంకటేషన్, మహిళా నాయకురాలు హసీనా సయ్యద్, ప్రస్తుత అధ్యక్షురాలు సాయిలక్ష్మి, ఎమ్మెల్యే విజయ ధరణిలతో పాటుగా పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు పాల్గొన్నారు.