రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Posted On:30-06-2015
No.Of Views:241

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో వూరట లభించింది. నెలరోజులుగా జైలులో ఉంటున్న ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి రాజా ఇళాంగో రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయసింహాలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నియోజకవర్గం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టు సమర్పించాలని, విచారణ నిమిత్తం ఏసీబీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు హాజరుకావాలని రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతులు విధించింది.ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే అన్ని అధారాలు సేకరించినందున తనకు బెయిల్ ఇవ్వాలని రేవంత్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గతవారం విచారించిన హైకోర్టు తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే అని, ఆయన పార్టీ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. వాదప్రతివాదనలు విన్న హైకోర్టు రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయసింహాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సంబంధిత ప్రక్రియలు పూర్తయితే రేవంత్‌రెడ్డి ఈరోజు సాయంత్రానికే చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.