మరో నేతను వివాదంలోకి లాగిన లలిత్‌మోదీ

Posted On:01-07-2015
No.Of Views:248

 హైదరాబాద్: పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్‌మోదీ తాజాగా మరో నేతను తన వివాదంలోకి లాగారు. ఇప్పటి భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తనను కొద్ది సంవత్సరాల క్రితం లండన్‌లో కలిశారని, తన ఆంటీకి (సోనియాగాంధీ) 60మిలియన్ డాలర్లు ఇస్తే అన్నీ సెటిల్ చేస్తానని తనకి ఆఫర్ ఇచ్చారని ఆయన ట్వీట్ చేశారు. సోనియా సోదరిని కలవాల్సిందిగా సూచించారన్నారు. అయితే అవన్నీ నిరాధారమైనవని లలిత్‌మోదీ వ్యాఖ్యలను వరుణ్‌గాంధీ కొట్టివేశారు. లలిత్ మోదీ ఇప్పటికే తనకు వీసా రావడంలో సహకరించారని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరరాజేలను ఇరుకున పెట్టారు. ఆ తర్వాత లండన్‌లో ప్రియాంకగాంధీ, రాబర్ట్‌వాద్రా, సినీనటుడు షారుఖ్‌ఖాన్‌లను కలిశానని చెప్పారు. తాజాగా వరుణ్ పేరును తెరపైకి తెచ్చారు. ప్రముఖుల పేర్లను వివాదాల్లోకి లాగి తద్వారా తన మీద నుంచి దృష్టి మళ్లించి లబ్ధి పొందాలని లలిత్ మోదీ చూస్తున్నారని వరుణ్ గాంధీ ఆరోపించారు.