డీఎస్‌ దారిలోనే దానం కూడా?

Posted On:01-07-2015
No.Of Views:276

 ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ నెల 6న టీఅర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై ఆయనతో చర్చించారు. ఈ నేపథ్యంలో డి.శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి లేదా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డీఎస్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడనున్నారని సమాచారం. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన దానం నాగేందర్, సుదర్శన్ రెడ్డి‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా చేయడంతో నిజామాబాద్ జిల్లాలో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీఎస్ సొంత జిల్లా నిజమాబాద్‌లో ఈ నెల 6న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ సమక్షంలో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. డిఎస్ చేరికతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు తీవ్రంగా మారనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆయనకు సొంత క్యాడర్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెసుపై ఆయన రాజీనామా ప్రభావం పడే అవకాశాలున్నాయి.